Fire Accident: హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుత్లిబౌలి మెయిన్‌రోడ్డు పక్కన ఆదివారం అర్ధరాత్రి దాటాక భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కనే ఉన్న గుడిసెలు అగ్నికి పూర్తిగా దహనమయ్యాయి. భారీగా మంటలు ఎగిసిపడటంతో గుడిసెలన్నీ క్షణాల్లో కాలిబూడిదయ్యాయి. ఈ సమయంలో గుడిసెవాసులంతా నివాసాల నుంచి బయటకు పరుగులు తీశారు.
Fire Accident: ఈ ప్రమాదంలో గుడిసెవాసులు దాచుకున్న నగదు, నిత్యావసర సామగ్రి, ఇతర వస్తు సామగ్రి పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. దీంతో వారంతా కట్టుబట్టలతో మిగిలారు. వెంటనే తరలివచ్చిన అగ్నిమాపక సిబ్బంది యంత్రాల సహాయంతో రెండుగంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ఇతర ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా సిబ్బంది చొరవ తీసుకోవడంతో పెను ముప్పు తప్పింది. లేకుంటే సమీపంలోనే నిలిపి ఉంచిన పదుల సంఖ్యలో ఉన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకు ప్రమాదం సంభవించి ఉండేది.
Fire Accident: ఈ గుడిసెల పైనుంచే విద్యుత్తు హైటెన్షన్ వైరు వెళ్తుంది. గాలి ప్రభావంతో ఆ వైర్లు రాసుకోవడంతో నిప్పురవ్వలు రాలి గుడిసెలపై పడటంతోనే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే సరిగ్గా ఏడాది క్రితం ఇలాంటి ప్రమాదమే సంభవించింది. యాధ్రుచ్ఛికమా లేక ఎవరైనా కావాలని కుట్రకోణంతో అగ్నిప్రమాదాన్ని సృష్టించారా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
Fire Accident: వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారంతా చాలాకాలంగా పుత్లిబౌలి ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న మూసీ ఒడ్డున నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. వారంతా చెత్త ఏరుకుంటూ, బట్టలను కుట్టుకుంటూ, మరికొందరు వివిధ పనులు చేసుకుంటూ చాలా ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. గత ఏడాది కూడా ఇదే సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 20 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. తమను ఖాళీ చేయించాలనే కుట్రతోనే ఈ అగ్నిప్రమాదానికి కుట్ర చేశారాని బాధితులు ఆనాడే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Fire Accident: మళ్లీ ఈరోజు కూడా జరిగిన ప్రమాదంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తమను ఖాళీ చేయించే కుట్రలో భాగంగానే ఈ పనిచేసి ఉంటారని వారు భావిస్తున్నారు. అత్యంత నిరుపేదలైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. కట్టుబట్టలతో మిగిలిన వారికి మానవతా హృదయంతో ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.