Fire Accident: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఒక హైదరాబాద్ యువతి అగ్ని ప్రమాదంలో చనిపోవడం అత్యంత బాధాకరం. జోడిమెట్ల వెంకటాపూర్ రోడ్డులోని శ్రీనివాస కాలనీకి చెందిన ఉడుముల సహజారెడ్డి (24) అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మన భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి అక్కడి ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ మంటల్లో చిక్కుకుని సహజారెడ్డి అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. ఈ దుర్వార్తను అధికారుల ద్వారా తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సహజారెడ్డి తండ్రి ఉడుముల జయాకర్ రెడ్డి హైదరాబాద్‌లోని టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు, తల్లి శైలజ టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు కాగా, పెద్ద కూతురు సహజారెడ్డి 2021లో ఎంఎస్ చదువు కోసం అమెరికాకు వెళ్లింది. చిన్న కూతురు హైదరాబాద్‌లోనే చదువుకుంటోంది. చదువు దాదాపు పూర్తవుతున్న సమయంలో జరిగిన ఈ అగ్నిప్రమాదం ఆ యువతిని బలి తీసుకుంది.
సహజారెడ్డి ఉంటున్న అపార్ట్‌మెంట్ పక్కనున్న మరో భవనం నుంచి మంటలు మొదలై వేగంగా ఇక్కడికి వ్యాపించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో సహజారెడ్డి నిద్రలో ఉండటం వలన ఆమె మంటల నుంచి తప్పించుకోలేకపోయారు. ప్రతిరోజూ వీడియో కాల్‌లో మాట్లాడే తమ కూతురు ఇక లేదన్న వార్త విని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ వార్త తెలియడంతో శ్రీనివాస కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సహజారెడ్డి మృతిపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం (ఇండియన్ ఎంబసీ) కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి, అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది.
