Father Kills Daughter: నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవాల్సిందే. పదవి కోసం ఒక తండ్రి ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు. సర్పంచ్ అవ్వాలనే రాజకీయ వ్యామోహం ఆ కన్నతండ్రిని రాక్షసుడిగా మార్చింది. కన్నకూతురినే కాలయముడై కడతేర్చిన ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
పదవి కోసం పసిప్రాణం బలి మహారాష్ట్రకు చెందిన పాండురంగ అనే వ్యక్తికి ముగ్గురు పిల్లలు. అయితే అక్కడ రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన ఆశపడ్డాడు. కానీ, మహారాష్ట్ర ఎన్నికల నిబంధనల ప్రకారం ఇద్దరు పిల్లలు ఉన్నవారే పోటీకి అర్హులు. ముగ్గురు పిల్లలు ఉంటే ఎన్నికల్లో నిలబడటం కుదరదు. ఈ నిబంధనే ఆ పసిపాప ప్రాణాల మీదకు తెచ్చింది. తన ఎదుగుదలకు మూడవ సంతానమైన ఆరేళ్ల కూతురు ‘ప్రాచి’ అడ్డుగా ఉందని ఆ కసాయి తండ్రి భావించాడు.
షికారుకు వెళ్దామని నమ్మించి.. బిడ్డను ఎలాగైనా వదిలించుకోవాలని చూసిన పాండురంగ, మొదట దత్తత ఇవ్వాలని ప్రయత్నించాడు. కానీ అది కుదరకపోవడంతో చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అమాయకపు బిడ్డకు బైక్‌పై షికారుకు వెళ్దామని మాయమాటలు చెప్పాడు.
ఇది కూడా చదవండి: Skywalk: రాయదుర్గం టు టీ హబ్.. 500 మీటర్ల స్కైవాక్, 400 మీటర్ల టన్నెల్ సిద్ధం!
తండ్రిని నమ్మిన ఆ చిన్నారి అల్లారుముద్దుగా అతని వెంట బయలుదేరింది. మహారాష్ట్ర సరిహద్దులు దాటి తెలంగాణలోని ఎడపల్లి సమీపంలో ఉన్న నిజాంసాగర్ కాలువ వద్దకు తీసుకువచ్చాడు. ఎవరూ లేని సమయం చూసి, ఏమాత్రం కనికరం లేకుండా ఆ పసిపాపను నిండు ప్రాణాలతోనే కాలువలోకి తోసేశాడు.
వాట్సాప్ స్టేటస్‌తో వీడిన మిస్టరీ జనవరి 29న కాలువలో ఒక గుర్తు తెలియని పసిపాప మృతదేహం లభించింది. అసలు ఆ పాప ఎవరు? ఎక్కడి నుండి వచ్చింది? అనేది పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. అయితే, నిజామాబాద్ పోలీసుల చాకచక్యం ఈ కేసును మలుపు తిప్పింది. ఒక కానిస్టేబుల్ ఆ పాప ఫోటోను తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. అది కాస్తా వైరల్ అయ్యి పాప వివరాలు తెలిశాయి.
దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారించగా, అసలు నిందితుడు కన్నతండ్రి పాండురంగ అని తేలింది. అంతేకాకుండా, ఈ ఘాతుకానికి సలహా ఇచ్చి ప్రోత్సహించిన సర్పంచ్ గణేష్ షిండే పాత్ర కూడా బయటపడింది. పోలీసులు వీరిద్దరినీ అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. పదవి కోసం కన్నపేగు బంధాన్ని తెంచుకున్న ఆ రాక్షస తండ్రిపై జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
