AP News: పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. వనజ గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు విషం తాగి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో దంపతులతో పాటు వారి చిన్నారి కూడా మృత్యువాత పడటం అందరినీ కలిచివేస్తోంది.
మృతులను మీనాక మధు (35), ఆయన భార్య సత్యవతి (30), వారి నాలుగు ఏళ్ల కుమార్తె మోస్యగా పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాలే ఈ అఘాయిత్యానికి ప్రధాన కారణమని ప్రాథమిక సమాచారం అందుతోంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలు చివరకు ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.
మరో దారుణమైన విషయం ఏమిటంటే, ఈ ఘటనలో మరో చిన్నారి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం ఆ పాప పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అసలు ఏం జరిగిందనే కోణంలో లోతైన దర్యాప్తు చేస్తున్నారు.
