Jaipur: పెళ్లి పేరుతో మోసాలు చేయడంలో దిట్టగా పేరుపొందిన సీమా అలియాస్ నిక్కిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనను వివాహం చేసుకున్నవారిని కేసుల బెడదతో బెదిరించి, భారీ మొత్తం వసూలు చేసే పద్ధతిని ఆమె పదేళ్లుగా అమలు చేస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం:
ఉత్తరాఖండ్‌కు చెందిన సీమా అలియాస్ నిక్కి 2013లో మొదట ఆగ్రాకు చెందిన వ్యాపారిని వివాహం చేసుకుంది. కొన్నాళ్ల తరువాత ఆమె భర్త కుటుంబంపై కేసు పెట్టి, రూ. 75 లక్షలు వసూలు చేసి కేసు ఉపసంహరించుకుంది.
2017లో గురుగ్రామ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుని, అతడితో విడిపోయి, రూ. 10 లక్షలు దండుకుంది.గతేడాది జైపూర్‌కు చెందిన వ్యాపారవేత్తను వివాహం చేసుకుని, అతడి నుంచి రూ. 36 లక్షల విలువైన నగలు, నగదును దోచుకుని పరారైంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సీమా మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లను ఉపయోగించి భార్యలను కోల్పోయినవారిని, విడాకులు పొందినవారిని లక్ష్యంగా చేసుకుంది. వివిధ రాష్ట్రాల్లో పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడి, ఇప్పటివరకు సుమారు రూ. 1.25 కోట్లు వసూలు చేసింది.
జైపూర్‌కు చెందిన వ్యాపారవేత్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.