Transfer of Employees: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రస్తుత బదిలీల షెడ్యూల్ జూన్ 2తో ముగియనుండగా, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదంతో ఈ గడువును జూన్ 9వ తేదీ వరకు పొడిగించారు.
పారదర్శకతే లక్ష్యం – ప్రభుత్వం ముందస్తు ప్లానింగ్
మే 15 నుంచి జూన్ 2 వరకు ఉద్యోగుల బదిలీలకు ఆర్థిక శాఖ అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అయితే, కొంతమంది ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, కొంత అదనపు సమయం అవసరమని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించడంతో మరో ఏడు రోజులు పాటు అవకాశం కల్పించారు.
ఇది కూడా చదవండి: Telangana Formation Day: నేడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
ఉద్యోగుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని…
ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గడువు పొడగింపు వల్ల ఇప్పటికీ బదిలీ ప్రక్రియ ప్రారంభించని ఉద్యోగులకు మరింత సమయం లభించనుంది. జూన్ 9వ తేదీ వరకు బదిలీల నిషేధం ఎత్తివేయబోతుండటంతో, ఉద్యోగుల అవసరాలు తీర్చుకునే మార్గం సుగమమవుతుంది.
బదిలీలకు సంబంధించి నిబంధనలు ఇవే:
-
ఒకే చోట ఐదేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ చేయబడతారు.
-
పదోన్నతి పొందిన ఉద్యోగులు ఐదేళ్లు పూర్తైతే బదిలీ తప్పనిసరి.
-
ఐదేళ్లలోపు సేవ ఉన్నవారు వ్యక్తిగత విన్నపం మేరకు బదిలీ చేయించుకోవచ్చు.
-
మే 31, 2026లోపు రిటైర్ అయ్యే ఉద్యోగులు బదిలీ నుంచి మినహాయింపు పొందుతారు.
-
అంధులు, మానసిక వికలాంగత కలిగిన పిల్లల తల్లిదండ్రులు, ట్రైబల్ ఏరియాల్లో పనిచేస్తున్నవారికి ప్రాధాన్యత.
-
మెడికల్ కారణాలు మరియు వితంతు ఉద్యోగుల అభ్యర్థన మేరకు ప్రత్యేక దృష్టి.
-
స్పౌజ్ (భర్త/భార్య) ఉద్యోగులు ఒకే ప్రాంతంలో పనిచేయేలా బదిలీకి వీలుగా నిర్ణయం.
ఉద్యోగ సంఘాల స్పందన
“ఈ నిర్ణయం వలన అనేక మంది ఉద్యోగులకు ఊరట లభించింది. సకాలంలో తమ బదిలీలను పూర్తి చేసుకునే అవకాశం లభించడంతో ప్రభుత్వం పట్ల ధన్యవాదాలు తెలుపుతున్నాం” అని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.