Etala rajendar: శామీర్‌పేట్‌లో జరిగిన మీడియా సమావేశంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా అందిస్తున్న సుపరిపాలన ప్రతి భారత పౌరుడికి గర్వకారణంగా మారిందని అన్నారు.
2014కి ముందు దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేదని గుర్తు చేసిన ఈటల, బీజేపీపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని మోదీ ప్రభుత్వం నిలబెట్టుకుందని చెప్పారు. “సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించి, భారత్‌ను ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత మోదీదే,” అని ప్రశంసించారు.
పాక్ ఉగ్రవాదుల ధారాళ చర్యలకు ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా భారత్ గట్టి ప్రతీకారం తీర్చుకుందని ఈటల పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలతో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తోందని, తెలంగాణకు పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి విజయరామారావు మాట్లాడుతూ, బీజేపీ పాలన అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అయితే కేంద్రం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత వెనుకబడి ఉన్నామని అంగీకరించారు.
“కాంగ్రెస్ హయాంలో మంత్రులు భారీ అవినీతికి పాల్పడి జైలులో ఉన్నారు. కానీ బీజేపీ పాలనలో పారదర్శకత ఉంది. మోదీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పథకాలతో దేశ అభివృద్ధిలో మహిళలు భాగస్వాములయ్యారు,” అని తెలిపారు.