Etala rajendar: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను రక్షించాల్సిన అవసరం తనకు లేదని బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణకు హాజరయ్యానని, అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలపై పూర్తివివరాలు కమిషన్‌కు అందించానన్నారు.
ప్రజలను దారితప్పించేందుకే కాంగ్రెస్ నేతలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల ప్రకారమే రూపొందించబడిందని, అనేక ప్రాజెక్టుల రీడిజైనింగ్ కూడా అదే సబ్ కమిటీ సూచనలతో జరిగిందని పేర్కొన్నారు. త్వరలోనే అన్ని జీవోలు, ఉపసంఘ నిర్ణయాలు, సూచనలు బయటపెడతానని తెలిపారు.
తుమ్మల వ్యాఖ్యలపై స్పందన
కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మంత్రివర్గ సమావేశానికి రాలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను ఈటల ఖండించారు. కేబినెట్ చర్చించకుండా ప్రభుత్వంలో ఏ అంశమూ జరగదని గుర్తుచేశారు. కాళేశ్వరం అంశంపై కేసీఆర్ ప్రతీ నిర్ణయానికి మంత్రుల సంతకాలు తీసుకున్నారని పేర్కొన్నారు. అప్పట్లో మంత్రులుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి తదితరులందరికీ ఈ విషయం తెలిసినదేనని వెల్లడించారు.
కాంగ్రెస్‌కి ధైర్యముంటే ఈ అంశాన్ని సీబీఐకి అప్పగించాలని ఈటల డిమాండ్ చేశారు. నిజం ఎలానో దేశ ప్రజలకు తెలుస్తుందని అన్నారు.