Kadiri: శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి రూరల్ మండలంలో ఉన్న ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో చోటుచేసుకున్న చోరీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆలయ ఆస్తులను కాపాడాల్సిన ఈవో మురళీకృష్ణే అమ్మవారి విలువైన వస్తువులను దోచుకోవడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆలయంలోని సుమారు ఐదు కిలోల వెండి ఆభరణాలు, పట్టుచీరలు ఇతర పూజా సామగ్రిని ఆయన తన కుటుంబ సభ్యుల సహాయంతో బయటకు తరలించే ప్రయత్నంలో పట్టుబడ్డాడు.
ఆటోలో ఆభరణాలు తీసుకెళ్తుండగా స్థానికులు అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటపడింది. ప్రశ్నలకు ఈవో సరైన సమాధానాలు ఇవ్వలేకపోవడంతో ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మురళీకృష్ణను, ఆయన కుటుంబ సభ్యులను ఆటోతో పాటు కదిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ ఈ ఘటనపై అధికారికంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Also Read: Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది షెడ్యూల్ ఖరారు
ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి చేరడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల్లో విశ్వాసాన్ని దెబ్బతీసే పనులు ఎలాంటి వారు చేసిన కఠిన చర్యలు తప్పవని స్పష్టంగా తెలిపారు. వెంటనే ఈవో మురళీకృష్ణను సస్పెండ్ చేయాలని, అరెస్ట్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
సీఎం ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తక్షణమే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ సమయంలో మురళీకృష్ణ హెడ్‌క్వార్టర్స్ వదిలి వెళ్లకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు. కదిరి గ్రూప్ దేవాలయాల అదనపు బాధ్యతలను తాత్కాలికంగా హిందూపురం దేవాదాయ శాఖకు అప్పగించారు. అమ్మవారి సొత్తును దోచేసిన ఈవోపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయ ఆస్తుల భద్రత, పర్యవేక్షణలో అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

