Encounter: ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గురువారం ఉదయం ఒక్కసారిగా తుపాకుల మోత మోగింది. బీజాపూర్ జిల్లాలోని పామెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య తీవ్రస్థాయిలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనతో సరిహద్దు గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు అక్కడ గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ పోరులో పలువురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే, మృతుల సంఖ్యపై అధికారికంగా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
కాల్పులు జరిగిన ప్రదేశం నుండి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను, మావోయిస్టుల సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పోలీసుల ఆధీనంలో ఉంది. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, ఉన్నతాధికారులు పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తారని సమాచారం. ఈ ఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
