Election Campaign

Election Campaign: రోబోటిక్ డాగ్స్ తో ఎలక్షన్ క్యాంపెయిన్

Election Campaign: మన దేశంలో ఎన్నికల ప్రచారం అంటే ఒకప్పుడు వీధి గోడల నిండా రాతలు, మైకు సెట్ల హోరు, రంగు రంగుల కరపత్రాలే గుర్తుకు వచ్చేవి. కానీ, కాలం మారుతున్న కొద్దీ ప్రచార శైలి కూడా ఊహించని మలుపులు తిరుగుతోంది. ముంగిట ఉన్న మున్సిపల్ ఎన్నికల వేళ, మహారాష్ట్రలోని పుణే నగరం ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ ప్రచారానికి వేదికగా నిలిచింది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు రోబోటిక్స్ వంటి అత్యాధునిక సాధనాలను రంగంలోకి దించారు.

ఈ క్రమంలో జనవరి 15న జరగనున్న పుణే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దేశం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా మనుషులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడం చూస్తుంటాం, కానీ పుణే వీధుల్లో ఇప్పుడు ‘రోబోటిక్ డాగ్స్’ సందడి చేస్తున్నాయి. రాజకీయ నాయకుల పోస్టర్లను మోస్తూ ఈ రోబో కుక్కలు రోడ్లపై తిరుగుతుంటే, జనం కూడా నోరెళ్లబెట్టి మరీ ఆ వింతను చూస్తున్నారు. అంతేకాదు, కొందరు కార్యకర్తలు వీపున ఎల్‌ఈడీ స్క్రీన్లను బ్యాక్‌ప్యాక్‌లా తగిలించుకుని వీధుల్లో తిరుగుతూ డిజిటల్ ప్రచారం సాగిస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Rajasaab: ప్ర‌భాస్ రాజాసాబ్ సినిమాకు చిక్కు.. అంత‌ర్జాతీయ స్థాయిలో మ‌చ్చ‌!

ప్రచారానికి సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఒక అస్త్రంలా వాడుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి చేరువ కావడానికి ఏఐ సాయంతో అద్భుతమైన వీడియోలు, సోషల్ మీడియా రీల్స్ మరియు ఆకట్టుకునే కంటెంట్‌ను తయారు చేస్తున్నారు. కేవలం ప్రచారం కోసమే కాకుండా, ఓటర్ల నాడిని పట్టుకోవడానికి కూడా టెక్నాలజీని వాడుతుండటం విశేషం. చాట్‌బాట్ల ద్వారా ఓటర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, డేటా ఆధారిత ప్రెజెంటేషన్లతో తాము చేయబోయే పనులను వివరించడం వంటి అంశాలు ఓటర్లలో నమ్మకాన్ని పెంచుతున్నాయి.

ముఖ్యంగా లోహేగావ్, విమాన్‌నగర్, వాఘోలి వంటి ఐటీ హబ్ ఉన్న ప్రాంతాల్లో అభ్యర్థులు తమ పనితీరును సూచించే గ్రాఫ్‌లు, ప్రాజెక్ట్ టైమ్‌లైన్లతో డిజిటల్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. రాజకీయ వాగ్దానాలను గాల్లో చెప్పకుండా, స్పష్టమైన డేటాతో వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఒకప్పుడు ఎన్నికలు అంటే హడావిడి, గొడవలు అనుకునేవారు, కానీ పుణే పుణ్యమా అని ఇప్పుడు ఎన్నికల ప్రచారం ఒక టెక్నాలజీ పండగలా కనిపిస్తోంది. టెక్నాలజీ వినియోగంలో పుణే నగరం ఇప్పుడు సరికొత్త బ్రాండ్‌గా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *