Hyderabad: హైదరాబాద్ నగరంలో త్వరలోనే “ఈకో టౌన్” ఏర్పాటు కాబోతుంది. వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, పునరుద్ధరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జపాన్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో పర్యావరణ అనుకూలమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జపాన్‌కు చెందిన కిటాక్యూషూ నగర మేయర్‌తో సమావేశమయ్యారు. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ప్రతిపాదించారు. కిటాక్యూషూ మేయర్ కూడా భారత్–జపాన్ సంబంధాలను మరింత బలపరచేందుకు, హైదరాబాద్ నుంచి జపాన్‌కు నేరుగా విమాన సేవలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ను అభ్యర్థించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో జపనీస్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. జపాన్‌తో ఉన్న భాగస్వామ్యాన్ని విద్య, సాంకేతిక రంగాలకు విస్తరించాలని పేర్కొన్నారు.
ఈ ఒప్పందంతో హైదరాబాద్ పర్యావరణహిత నగరంగా మారేందుకు ఒక కొత్త దిశగా అడుగులు వేస్తోంది. జపాన్ అనుభవాన్ని ఉపయోగించుకుని, వ్యర్థాల నిర్వహణ, గ్రీన్ టెక్నాలజీ వంటి రంగాల్లో ముందడుగు వేయనుంది.

