Ebola Virus:

Ebola Virus: హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. రాత్రికి రాత్రే ఇద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలింపు!

Ebola Virus: హైదరాబాద్ లో ఎబోలా వైరస్ (Ebola Virus) భయాలు ఒక్కసారిగా తీవ్ర కలకలం సృష్టించాయి. ఎబోలా తరహా ప్రాథమిక లక్షణాలు ఉన్న యాగౌచ్ అహ్మద్, అబ్దుల్ మజీద్ అనే ఇద్దరు వ్యక్తులను రాత్రికి రాత్రే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి నుంచి సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రికి అత్యవసరంగా తరలించారు.

వైద్య వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఇద్దరు వ్యక్తులు ఇటీవలే ఆఫ్రికా దేశమైన సూడాన్‌ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. వారికి ఆఫ్రికా దేశాల ప్రయాణ నేపథ్యం (Travel History) ఉండటం, దానికి తోడు ఎబోలాను పోలిన అనుమానిత లక్షణాలు కనిపించడంతో నగర వైద్య ఆరోగ్య శాఖ ఒక్కసారిగా హై అలర్ట్ ప్రకటించింది.

ప్రైవేట్ ఆస్పత్రి అలర్ట్.. గాంధీ ఐసోలేషన్ వార్డుకు బాధితులు

సదరు బాధితులు తొలుత అపోలో ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడ వారి లక్షణాల తీవ్రతను గమనించిన ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం తక్షణమే స్పందించింది. ఎబోలా వైరస్ నిబంధనల (Protocols) ప్రకారం.. ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు బాధితులను ప్రభుత్వ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేసింది.

ప్రస్తుతం వీరిద్దరిని గాంధీ ఆస్పత్రిలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఎబోలా ఐసోలేషన్ వార్డు’ (Isolation Ward) కు తరలించారు. అక్కడ ప్రత్యేక వైద్య బృందాల కఠిన పర్యవేక్షణలో వారికి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు.

తీవ్రమైన జ్వరం.. సీసీఎంబీ(CCMB)కి శాంపిల్స్!

వైద్యులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. బాధితులిద్దరూ ప్రస్తుతం తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. నిబంధనల ప్రకారం.. వారి రక్తం (Blood), లాలాజలం (Saliva) శాంపిల్స్‌ను వైద్య సిబ్బంది అత్యంత జాగ్రత్తగా సేకరించారు. తక్షణ నిర్ధారణ పరీక్షల కోసం ఈ నమూనాలను హైదరాబాద్‌లోని ప్రసిద్ధ సీసీఎంబీ (CCMB) ల్యాబొరేటరీకి పంపించారు.

  • రిపోర్టులకు 48 గంటల సమయం: సీసీఎంబీ ల్యాబ్ నుంచి ఈ పరీక్షల నివేదికలు (Reports) రావడానికి కనీసం 24 నుంచి 48 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

  • పూణే ఎన్‌ఐవీకి తదుపరి పరీక్షలు: ఒకవేళ హైదరాబాద్ సీసీఎంబీ ప్రాథమిక పరీక్షల్లో ఎబోలా పాజిటివ్ అని తేలితే గనుక.. తదుపరి పూర్తి స్థాయి అధికారిక ధృవీకరణ కోసం ఈ శాంపిల్స్‌ను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) కి పంపించనున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతానికైతే ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. పూర్తి రిపోర్టులు వస్తేనే ఇది ఎబోలానా కాదా అనేది స్పష్టమవనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *