DHARMAPURI ARAVIND: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఓటమి తప్పదని, ఆ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు మినహా ఇంకెవ్వరూ గెలిచే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపిస్తూ, ఆ పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ అరవింద్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం అవినీతిపైన పెదవి విప్పి, సాయంత్రం అదే నాయకులతో భేటీ కావడం కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తుందన్నారు. అవినీతిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే, ప్రజల్లో తప్పుడు సందేశాలు వెళతాయని హెచ్చరించారు.
ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా జూన్ 29న నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా పసుపు రైతుల కలల నెరవేర్పుగా, పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారని వెల్లడించారు. ఇది పసుపు రైతుల జీవితాల్లో ఓ కొత్త అధ్యాయాన్ని తెరలేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతేకాక, కేంద్ర మంత్రి అమిత్ షా తన పర్యటనలో మాజీ కాంగ్రెస్ నేత డి. శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే ‘రైతు సమ్మేళనం’లో పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.