Pawan Kalyan

Pawan Kalyan: గ్రౌండ్ లెవెల్‌లో డిప్యూటీ సీఎం పవన్ యాక్షన్.. మన్యం జిల్లా పెదపెంకిలో అభివృద్ధి పనులపై సమీక్ష.

Pawan Kalyan: పార్వతీపురం మన్యం జిల్లాలోని పెదపెంకి గ్రామంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ గ్రామంలో వందకు పైగా పైలేరియా కేసులు నమోదు కావడం, అలాగే తరచూ ప్రజలు రకరకాల ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో పవన్ కల్యాణ్ అక్కడి సమస్యలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడమే ఈ రోగాలన్నింటికీ ముఖ్య కారణమని అధికారులు గుర్తించారు.

గ్రామంలో మురుగునీరు పోవడానికి సరైన మార్గాలు లేకపోవడం, కొన్ని చోట్ల కాలువలు ఆక్రమణలకు గురికావడంతో మురుగునీరు నిలిచిపోయి దోమలు, రోగాలు పెరుగుతున్నట్లు అధికారులు గమనించారు. దీనిపై స్పందించిన అధికారులు.. అక్కడి ప్రజలతో స్వయంగా మాట్లాడి, వారిని ఒప్పించి ఆక్రమణలను తొలగించారు. గ్రామంలో మురుగునీటి సమస్య పోవడానికి కొత్తగా ‘మ్యాజిక్ డ్రెయిన్లు’ నిర్మిస్తున్నట్లు ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు అధికారులు వివరంగా తెలియజేశారు.

మొదట్లో ఈ ఆక్రమణల తొలగింపు సమయంలో గ్రామస్థుల నుండి కొంత వ్యతిరేకత ఎదురైనప్పటికీ, వారికి నచ్చజెప్పి పనులను ముందుకు తీసుకెళ్లామని అధికారులు చెప్పారు. ఎన్నో సామాజిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ అధిగమించి గ్రామాభివృద్ధి కోసం కష్టపడిన జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా, ఈ నెల 24వ తేదీన తాను స్వయంగా పెదపెంకి గ్రామానికి వచ్చి, అక్కడ నిర్మించిన మ్యాజిక్‌ డ్రెయిన్లను, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *