AP News: ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆకస్మికంగా వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తించింది. ఎలాంటి సెక్యూరిటీ హంగామా, కాన్వాయ్ లేకుండా పవన్ కల్యాణ్ ఒంటరిగా (సింగిల్‌గా) సీఎం నివాసానికి చేరుకుని కొద్దిసేపు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, తాజా న్యాయపరమైన పరిణామాలు, ఎన్నికల ప్రక్రియ తదితర అంశాలపై సీఎంతో పవన్ ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరఫున పలు చోట్ల తెరపైకి వచ్చిన రెబల్స్ వ్యవహారంపై కూడా ఇరు నేతలు సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వ్యూహాలు, కూటమి అభ్యర్థుల సమన్వయంపై ఇరువురి మధ్య ఏకాంతంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి సీట్ల సర్దుబాటుపై పలుమార్లు భేటీ అయినప్పటికీ, తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఎలాంటి ఆర్భాటం లేకుండా నేరుగా సీఎం వద్దకు వెళ్లి చర్చించి తిరిగి వెళ్లిపోవడం ఉమ్మడి రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.
