Pawan Kalyan

Pawan Kalyan: మధ్యప్రదేశ్ వాళ్లను అడ్డుకోవద్దు.. చట్టం తన పని తాను చేస్తుంది

Pawan Kalyan: రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులమని, దేశంలో ఎక్కడైనా నివసించే, పనులు చేసుకునే హక్కును రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ కల్పించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలో మధ్యప్రదేశ్ మాండ్లా పార్లమెంటు సభ్యుడు, ఎస్సీ-ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తేతో భేటీ అయిన సందర్భంగా పవన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ‘స్థానికేతరులు’ అనే నెపంతో అభివృద్ధి పనులను లేదా వ్యాపారాలను అడ్డుకునే వారి పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన హెచ్చరించారు.

పుంగనూరులో గ్రానైట్ మైనింగ్ వివాదం

ఈ భేటీలో డాక్టర్ కులస్తే ఒక ఆందోళనకరమైన అంశాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుంలో గ్రానైట్ మైనింగ్ కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు చట్టబద్ధంగా అనుమతులు పొందారు. అయితే, అక్కడ మైనింగ్ ప్రారంభించకుండా స్థానిక నాయకులు కొందరు అడ్డుతగులుతున్నారని, “ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మైనింగ్ ఎలా చేస్తారు?” అంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్నా, కేవలం ప్రాంతీయత పేరుతో పనులను ఆపడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవాడి: CM Chandrababu: పోలవరం పనులు వేగవంతం చేయాలి: క్షేత్రస్థాయిలో సీఎం చంద్రబాబు పరిశీలన

చట్టం తన పని తాను చేస్తుంది

ఫగ్గన్ సింగ్ కులస్తే చేసిన ఫిర్యాదుపై స్పందించిన పవన్ కల్యాణ్, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ప్రవర్తించే నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. “అనుమతులు ఉన్న వారు నిబంధనల ప్రకారం తమ పనులు చేసుకోవచ్చు. ఎవరైనా అడ్డుతగిలితే వారిపై కఠినంగా వ్యవహరించమని అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇస్తాం” అని పవన్ భరోసా ఇచ్చారు.

సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం

కేవలం రాజకీయ లబ్ధి కోసం లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టుబడిదారులను, ఇతర రాష్ట్రాల వారిని ఇబ్బంది పెట్టే సంస్కృతికి స్వస్తి పలకాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఏ ప్రాంతం వారైనా సరే ఆంధ్రప్రదేశ్‌లో పారదర్శకంగా పనులు చేసుకునే వాతావరణాన్ని కల్పిస్తామని, శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదని ఆయన పునరుద్ఘాటించారు. ఈ భేటీలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన పలు ఇతర అంశాలపై కూడా ఇరువురు నేతలు చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *