Delhi: ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ప్రముఖ సెలబ్రిటీలపై మనీలాండరింగ్ కోణంలో విచారణ చేపట్టి, వారి ఆస్తులను అటాచ్ చేసింది.
ఈ కేసులో నటుడు సోనూ సూద్, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పతో పాటు నటీమణులు నేహా శర్మ, ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తి వంటి వారు ఉన్నారు. వీరికి సంబంధించిన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.
తాజాగా అటాచ్ చేసిన ఆస్తుల విలువ సుమారు రూ.7.93 కోట్లు కాగా, ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం రూ.19.7 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్టు వెల్లడించింది.
బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన అక్రమ ఆదాయాన్ని ప్రమోషన్ల ద్వారా చట్టబద్ధంగా మార్చే ప్రయత్నం జరిగిందన్న అనుమానంతో, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
