Delhi: లోక్సభ శుక్రవారం పాన్ మసాలా తయారీ యూనిట్లపై సెస్సు విధించే ‘హెల్త్ సెక్యూరిటీ సే–నేషనల్ సెక్యూరిటీ సెస్సు బిల్లు–2025’ను ఆమోదించింది. పాన్ మసాలా కంపెనీలపై ప్రత్యేక సెస్సును ప్రతిపాదిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రజారోగ్యం మరియు జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి ప్రత్యేక నిధులను సమకూర్చాల్సిన అవసరం ఉందని ఆమె వివరించారు.
చర్చకు సమాధానమిస్తూ నిర్మలా సీతారామన్, ప్రజారోగ్యం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందనడం వల్ల సెస్సు ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకుంటామని తెలిపారు. ఈ నిధులను జాతీయ భద్రతతో పాటు ప్రజారోగ్యానికి ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. బిల్లు పార్లమెంటు దిగువ సభలో మూజువాణి ఓటు ద్వారా ఆమోదం పొందింది.
పాన్ మసాలా మరియు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేసే యూనిట్లన్నింటికీ ఈ సెస్సు వర్తించనుందని మంత్రి చెప్పారు. తయారీ సామర్థ్యాన్ని ఆధారంగా తీసుకుని సెస్సును విధిస్తామని తెలిపారు. ప్రస్తుతం పాన్ మసాలాపై జీఎస్టీ గరిష్ఠ శ్లాబు 40 శాతం కొనసాగుతుందని, కొత్త సెస్సు కారణంగా జీఎస్టీ ఆదాయంలో ఎలాంటి తగ్గుదల రాదని స్పష్టం చేశారు.
2010–14 మధ్య సెస్సుల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 7 శాతం కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది 6.1 శాతానికి తగ్గిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ లోటును భర్తీ చేయడానికి మరియు ఆరోగ్య–భద్రత రంగాలకు అదనపు నిధులు అందించడానికి కొత్త సెస్సు కీలకమని ఆమె పేర్కొన్నారు.

