Delhi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు ముఖ్యమైన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదించడం, దేశ అభివృద్ధికి సంబంధించి పలు ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపడం, అంతరిక్షంలో అడుగుపెట్టిన భారత వ్యోమగామికి అభినందనలు తెలిపే తీర్మానాన్ని ఆమోదించడం ముఖ్యంగా నిలిచాయి.
ఎమర్జెన్సీ బాధితులకు నివాళి – 50 ఏళ్ల ‘సంవిధాన్ హత్యా దినం’
సమావేశ ప్రారంభంలో కేంద్ర కేబినెట్ సభ్యులు 1975లో విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) సమయంలో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు గౌరవంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం, ప్రజాస్వామ్యాన్ని అణిచివేసిన ఈ ఘటనను ఖండిస్తూ ఓ ప్రత్యేక తీర్మానం ఆమోదించారు.
ఈ సందర్భంగా మోదీ మంత్రివర్గం,
“ఈ సంవత్సరం ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తవుతున్నాయి. దాన్ని ‘సంవిధాన్ హత్యా దినం’గా గుర్తు చేసుకుంటున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడిన వారందరికీ ప్రభుత్వం శ్రద్ధాంజలి అర్పిస్తుంది,” అని పేర్కొంది.
ఆగ్రా – పుణే అభివృద్ధికి భారీ నిధులు
కేంద్ర కేబినెట్ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో, బంగాళాదుంపలపై పరిశోధనకు అంతర్జాతీయ స్థాయి సౌత్ ఏషియన్ రీజినల్ రీసెర్చ్ సెంటర్‌ను స్థాపించేందుకు అనుమతి ఇచ్చింది. ఇది అంతర్జాతీయ బంగాళాదుంప కేంద్రం (CIP) ఆధ్వర్యంలో నిర్మించబడుతుంది. ప్రాజెక్టు వ్యయం రూ.111.5 కోట్లు.
అలాగే, మహారాష్ట్రలోని పుణే మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు రూ.3,626 కోట్లు ఖర్చు చేయాలని మంత్రివర్గం ఆమోదించింది. ఈ మెట్రో విస్తరణతో నగర రవాణా వ్యవస్థ మరింత వేగవంతం, సౌకర్యవంతం కానుంద.
ఝరియా నిర్వాసితుల పునరావాసానికి భారీ నిధులు
ఝార్ఖండ్‌లోని ఝరియా బొగ్గు గనుల ప్రాంతంలో వలస వెళ్ళిన కుటుంబాల పునరావాసం కోసం రూపొందించిన “ఝరియా మాస్టర్ ప్లాన్”కు కేంద్రం రూ.5,940 కోట్ల నిధులు కేటాయించింది.
భారత వ్యోమగామిగా అంతరిక్షంలో అడుగుపెట్టిన శుభాంశు శుక్లాకు కేంద్ర కేబినెట్ ప్రత్యేక అభినందనలు తెలియజేసింది. శుక్లా నేతృత్వంలోని బృందం విజయవంతంగా అంతరిక్ష ప్రయాణం చేయడాన్ని గర్వంగా పేర్కొంది.
“140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను శుభాంశు శుక్లా అంతరిక్షానికి తీసుకెళ్లారు. ఇది దేశానికి గర్వకారణం,” అని కేబినెట్ పేర్కొంది. ఈ సందర్భంగా ఇతర అంతరిక్షయాత్రికులకు కూడా అభినందనలు తెలియజేశారు.