Delhi Assembly Elections 2025: తెలంగాణలో కేసీఆర్, ఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమికి ఒకటే కారణమా? ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. అన్న చందంగా బీజేపీ దెబ్బకొట్టిందా? కేజ్రీవాల్‌కు సానుభూతి కన్నా, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందా? అందుకే ఓటమి అంచున నిలిపారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కొరకరానికి కొయ్యలుగా మారిన ఇటు కేసీఆర్‌ను, అటు కేజ్రీవాల్‌ను అడ్డు తొలగించుకోవాలన్న ఆ పార్టీ కల ఇప్పటితో సంపూర్ణంగా నెరవేరిందని విశ్లేషకులు సైతం ఒప్పుకుంటున్నారు.
Delhi Assembly Elections 2025: ప్రధానంగా లిక్కర్ స్కాం ఈ రెండు రాష్ట్రాల్లో బీఆర్ఎస్‌ను, ఆప్‌ను దెబ్బకొట్టిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలుత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కామ్‌లో పేరు రావడం, ఆ తర్వాత అరెస్టు అయి జైలు జీవితం అనుభవించారు. దాంతో అటు అసెంబ్లీ, ఆతర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసి వినూత్న పాలన సాగించిన నేతగా కేసీఆర్‌కు ఎంత పేరున్నా, లిక్కర్ స్కాంలో అంటిన అవినీతి మరక ఆపార్టీని రాష్ట్ర ప్రజలు ఓటమిపాలు చేశారు.
Delhi Assembly Elections 2025: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్నే లిక్కర్ స్కాం అతలాకుతలం చేసింది. ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి సిసోడియా, మరో ఎంపీ ఈ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అయి జైలుకెళ్లారు. అవినీతి రహిత పాలన అందిస్తానంటూ రాజకీయాల్లో ఓ ప్రత్యేకతగా నిలిచిన ఆప్ పార్టీపై ఈ అవినీతి మరక అంటగానే జనంలో ఆలోచన రేకెత్తింది. జైలు నుంచి బయటకు వచ్చి తాను అవినీతికి తావివ్వలేదని ఎంతగా చెప్పినా ఓటర్లు నమ్మలేదు. ఈ దశలో చైతన్యవంతులైన ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. అవినీతిని అంతం చేస్తామన్న పార్టీ అవినీతి ఊబిలో కూరుకుపోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందుకే ఈ ఎన్నికల్లో ఓట్ల రూపంలో ప్రతిఫలించి కేజ్రీవాల్ పార్టీని ఓటమి అంచున నిలిపారు.
Delhi Assembly Elections 2025: సాధారణంగా జైలుకు వెళ్లొచ్చిన నేతలపై సానుభూతితో గెలిపించడం ఆనవాయితీగా భారతీయ ఓటర్లలో కనిపించే అంశం. ముఖ్యంగా ఏపీలో వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తమిళనాడులో జయలలిత.. ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు పార్టీ అధినేతలు వివిధ ఆరోపణలపై జైలుకు వెళ్లొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠాలను అధిష్టించారు. అయితే ఇక్కడ ఢిల్లీలో లిక్కర్ స్కాములో జైలుకెళ్లి వచ్చిన కేజ్రీవాల్‌కు చుక్కెదురైంది. సానుభూతి పవనాలు వీయకపోగా, వ్యతిరేక పవనాలే ఆప్‌ను ఓటమి అంచునకు చేర్చాయి.