dasoju sravan: తెలంగాణ రాజకీయాలలో వేడి పెరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కే.కవిత రాసినట్లుగా ప్రచారంలో ఉన్న లేఖపై ఆయన స్పందిస్తూ, ఇప్పటి వరకు ఆ లేఖను ఆమె స్వయంగా గానీ, పార్టీ అధిష్ఠానం గానీ ధృవీకరించలేదని స్పష్టంచేశారు. దాసోజు మాట్లాడుతూ, “ఒకవేళ కవిత లేఖ రాసినట్లయితేనూ, దాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. పార్టీ విషయాలపై ఫీడ్‌బ్యాక్‌ను కూతురిగా తండ్రికి తెలిపినట్టుగా భావించాలి.
ఇది అంత పెద్ద సమస్య కాదని,” తెలిపారు. అలాగే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చురకలాడుతూ, “తన సీటు ఉంటుందో లేదో రేవంత్ గారు ముందుగా చూసుకోవాలి,” అంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సీఎం తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా లీకులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ పై ప్రశ్నించిన సందర్భంలో దాసోజు, “అయన గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాను,” అని వ్యాఖ్యానించారు. తమ పార్టీలో తలెత్తుతున్న ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హితవు పలికారు. “కార్యకర్తలు నిశ్చింతగా ఉండాలి. పార్టీ లోపలి వ్యవహారాలు పార్టీ నేతలే చక్కదిద్దుకుంటారు,” అని ధీమా వ్యక్తం చేశారు.
