Dhanunjay Reddy: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్ కేసు క్లైమ్యాక్స్‌కు చేరుకుంటోందా? వైసీపీ ప్రభుత్వంలో సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డిల అరెస్టు ప్రీ క్లైమాక్సేనా? అంటే జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయంటున్నారు పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్. ముఖ్యంగా ధనుంజయ రెడ్డి అరెస్టు వైసీపీలో కలకలం రేపింది. ఆయన నోరు విప్పితే జగన్ జైలుకు వెళ్తారని నేతలు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ హయాంలో ‘షాడో సీఎం’గా చక్రం తిప్పారన్నది ధనుంజయ రెడ్డిపై ఉన్న ఆరోపణ. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లెకు చెందిన ధనుంజయరెడ్డి 1988లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటుగా మారాడు. వైఎస్ ఆర్థిక లావాదేవీలను స్వయంగా పర్యవేక్షించిన ధనుంజయ, వైఎస్ ఆదేశాలకు కట్టు బానిసలా పనిచేస్తారని చెప్తుంటారు. సర్పంచ్ నుంచి డానిక్స్ సర్వీసులో చేరినా, ఢిల్లీలో ఉంటూ వైఎస్‌తో సంబంధాలు కొనసాగించాడు. 2004లో వైఎస్ సీఎంగా ఎన్నికైన వెంటనే, ధనుంజయ ఉమ్మడి ఏపీకి డిప్యూటేషన్‌పై వచ్చి, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ కమిషనర్‌గా ఎనిమిదేళ్లు పనిచేశాడు. అప్పటి ప్రభుత్వ పెద్దల సహకారంతో రాష్ట్ర సర్వీసులో విలీనమై, ఐఏఎస్‌గా పదోన్నతి పొందాడు.
2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా, ఎన్‌టీఆర్ వైద్య సేవ సీఈవోగా, శ్రీకాకుళం కలెక్టర్‌గా, ఏపీటీడీసీ ఎండీగా విధులు నిర్వహించాడు ధనుంజయరెడ్డి. అయితే, ప్రభుత్వానికి పనిచేసినా, వైసీపీకి సేవలందించాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట, ఎన్‌టీఆర్ వైద్య సేవల్లో బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం, పర్యాటక రంగంలో అభివృద్ధికి మోకాలడ్డడంపై విమర్శలు ఎదురయ్యాయి. అయితే ఎక్కడా వైఎస్ ఫ్యామిలీకి విధేయుడన్న అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారని చెబుతారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక, ధనుంజయ సీఎంఓలో కీలక పాత్ర పోషించాడు. జగన్ రాజకీయ ప్రత్యర్థులపై కేసులు, అరెస్టులు, వారి ఆర్థిక మూలాలు దెబ్బతీయడంలో ఆయన ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నేతలపై చిత్రహింసలు, కస్టడీ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షించినట్లు చెబుతారు. మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావును జగన్‌తో కలవకుండా అడ్డుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తనను ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసుకునేందుకు జగన్ అపాయింట్‌మెంట్ అడిగినా కూడా ధనుంజయరెడ్డి అనుమంతించలేదని ఏబీవీ స్వయంగా ఆరోపించారు.
Also Read: Lokesh CM Candidate: 43 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో కొత్త అధ్యాయం
Dhanunjay Reddy: ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష, అభ్యర్థుల ఎంపికలోనూ ధనుంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు చెబుతారు. ఏ ఎమ్మెల్యే జగన్‌ను కలవాలన్నా ధనుంజయ అనుమతి తప్పనిసరని ప్రచారం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యేలు ధనుంజయపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు లెక్కలేనన్ని. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే.. ధనుంజయరెడ్డి ‘సీఎం’గా వ్యవహరిస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అలా ధనుంజయరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలను గడ్డిపోచల్లా చూసేవారన్న ఆరోపణలు అనేకం ఉన్నాయి. ధనుంజయరెడ్డిపై జగన్ అంతగా ఆధారపడటానికి కారణం కూడా.. ఆర్థిక లావాదేవీలేనని చెబుతారు. ఇక లిక్కర్ స్కామ్‌లోనూ ధనుంజయరెడ్డే ఆర్థిక లావాదేవీలను నిర్వహించాడని, ఆ సొమ్ము జగన్ ప్యాలెస్‌కు చేరేలా చూశాడన్నది తాజాగా ఆయనపై నమోదైన అభియోగాలు. ఒక్కమాటలో చెప్పాలంటే.. జగన్ చిట్టా, ఆయన నమ్మినబంటు ధనుంజయ చేతిలో ఉంది. అందుకే ధనుంజయ అరెస్ట్‌తో తాడేపల్లి ప్యాలెస్ కింద భూకంపం వచ్చినట్లు అయ్యిందన్నది ఎక్స్‌పర్ట్స్ చెప్తున్న మాట.
