AP News: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెనాలి పర్యటనలో అనుకోని వివాదాలు చెలరేగాయి. ఆయన రౌడీషీటర్లను పరామర్శించేందుకు వస్తున్నారన్న వార్తలపై దళిత, ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఐతా నగర్, ఎర్రబడి ప్రాంతాల్లో నిరసనలు ఉధృతంగా చోటుచేసుకున్నాయి.
జగన్ కాన్వాయ్ తెనాలి మార్కెట్ సెంటర్ వైపు వస్తుండగా, దళిత సంఘాలు నల్ల బెలూన్లను ఎగురవేసి నిరసన తెలిపాయి. నాయకులు “జగన్ గో బ్యాక్” వంటి నినాదాలతో ఆందోళన చేపట్టారు. మార్కెట్ సెంటర్‌లో మానవహారం ఏర్పాటు చేసి ప్రజా సంఘాల సభ్యులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్‌ను పరామర్శించకపోవడం, కానీ రౌడీషీట్లు ఉన్న వారిని కలవడం దారుణమని ఆ సంఘాల నాయకులు విమర్శించారు. ముఖ్యంగా ఎమ్మార్పీఎస్ సభ్యులు జగన్ కాన్వాయ్‌ను ఎర్రబడి వద్ద అడ్డుకున్నారు. “ఇప్పుడే దళితులపై ప్రేమ వచ్చిందా?” అంటూ కఠిన ప్రశ్నలు సంధించారు.
Also Read: Nagarjuna-CM Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన నాగార్జున – అఖిల్ వివాహానికి ఆహ్వానం
AP News: జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. రోడ్డుపైకి రావాలనుకున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ, తెనాలిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఈ పరిణామాలపై వైసీపీ నేతలు ఆందోళనకు లోనవుతున్నారు. ప్రజల నుండి రావాల్సిన స్వాగతం కన్నా నిరసనలు ఎదురవడం పార్టీ స్థానిక నాయకత్వాన్ని కాస్త అప్రమత్తం చేసింది. జగన్ పర్యటన అనంతర రాజకీయ పరిణామాలపై అందరి దృష్టి కేంద్రంగా మారింది.