Telangana

Telangana: బిర్యానీ తిని హోటల్ సిబ్బందిపై దాడి చేసిన కస్టమర్

Telangana: కస్టమర్‌ రూపంలో హోటల్‌కు వచ్చిన ఓ వ్యక్తి ఎంచక్కా కడుపు నిండా బిర్యానీ లాగించేశాడు. తిన్న అనంతరం దర్జాగా బయటకు వెళ్తున్నాడు. ఈ సమయంలో హోటల్‌ సిబ్బంది ‘డబ్బులు’ అని అడగ్గా అంతే ఆ కస్టమర్‌కు కోపం వచ్చేసింది. సిబ్బందితో గొడవకు దిగాడు. అంతేకాకుండా బయటకు వెళ్లి ఇనుప రాడ్డుతో వచ్చి కౌంటర్‌లో కూర్చున్న సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. కస్టమర్‌ దాడిలో హోటల్‌ సిబ్బంది తలకు తీవ్రంగా గాయమైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో వైరల్‌గా మారింది.

హైదరాబాద్‌ లాలగూడలో ప్రాంతంలో సూపర్ స్టార్ హోటల్ ఉంది. ఇక్కడ నిత్యం ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి భోజనం చేస్తుంటారు. ఇటీవల ఓ వ్యక్తి వచ్చి హోటల్‌ భోజనం చేశాడు. అనంతరం బిల్లు కట్టకుండా వెళ్లిపోతుండగా సిబ్బంది అడ్డుకున్నారు. తననే డబ్బులు అడుగుతారా అంటూ బయటకు వెళ్లి ఇనుప రాడ్డు తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారు. బిర్యానీకి డబ్బులు అడగడంతో రాడ్డుతో హోటల్ ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. అడ్డుకున్న వారిని బెదిరించాడు. ఈ ఘటనలో హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి తలకు భారీ గాయమైంది.

Also Read: Vizag: భర్త షికారుకి తీసుకెళ్లలేదని ఇల్లాలు అలక.. క్షణికావేశంలో ఆత్మహత్య

హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడికి పాల్పడిన దుండగుడి వివరాలు తెలియరాలేదు. నిత్యం అలా వేధిస్తున్నాడని హోటల్‌ సిబ్బంది వాపోయింది. ‘ప్రతి రోజు తనకు బిర్యానీ ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బిర్యానీ ఫ్రీగా ఇవ్వకపోతే దాడులకు దిగుతున్నాడు’ అని హోటల్‌ నిర్వాహకులు వాపోయారు. దాడికి పాల్పడిన అనంతరం దుండగుడు పారిపోయాడు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో తరచూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటుండడంతో నగరంలో భయాందోళన ఏర్పడింది. శాంతి భదత్రలు పటిష్టం చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *