Crime News: హైదరాబాద్ మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మహిళ హత్యోదంతం మలుపులు తిరుగుతున్నది. తన భార్యను తానే చంపానని పోలీసులకు ఆమె భర్త చెప్పినా, సరైన ఆనవాళ్లు లభ్యంకాకపోవడంతో పోలీసులు ఈ కేసు వివరాలను ఇంకా వెల్లడించడం లేదు. అయితే ఈ కేసు విషయంలో అనేక అంశాలు వెల్లడవుతున్నాయి. పోలీసులు విచారణలో మరో కోణం బయటపడ్డట్టు వార్తలొస్తున్నాయి.
Crime News: మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ న్యూ వెంకటేశ్వర కాలనీలో గురుమూర్తి తన భార్య వెంకటమాధవిని దారుణంగా చంపి, ముక్కలు చేసి, కుక్కర్ లో ఉడికించిన వార్తలు బయటకొచ్చాయి. అయితే ఆ శరీర భాగాలను ఎక్కడ వేశాడన్నది అంతుచిక్కడం లేదు. మీర్‌పేట చెరువులో పడేసినట్టు నిందితుడు గురుమూర్తి చెప్పడంతో వారు చెరువులో వెతికినా సాక్ష్యాధారాలు లభ్యం కాలేదు. ఆమె శరీరభాగాలను పొడి చేసి అదే చెరువులో వెదజల్లితే చేపలు, ఇతర జీవులు తినేయడంతో ఆధారాలు దొరకలేదా? అన్న అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఫోరెన్సిక్ బృందాలతో వెతికినా ఆధారాలు మాత్రం లభ్యంకాలేదు.
Crime News: ఇదిలా ఉండగా, పోలీసుల విచారణలో మరో కోణం బయటపడింది. గురుమూర్తి సెల్‌ఫోన్‌ను పరిశీలించగా, దానిలో మరో మహిళ ఫొటోలు కనిపించాయి. ఆమెతో గురుమూర్తి చనువుగా ఉన్న విషయం తెలుస్తున్నది. దీంతో ఆ మహిళ కోసమే గురుమూర్తి తన భార్య వెంకటమాధవి అడ్డు తొలగించుకోవాలని భావించినట్టు తెలుస్తున్నది. ఆ మహిళ విషయంలో ఇద్దరికీ గొడవలు జరిగేవని తెలుస్తున్నది. సంక్రాంతి పండుగ రోజు కూడా ఇదే విషయంలో గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన గురుమూర్తి తన భార్య తలను గోడకేసి కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత మటన్ కొట్టే కత్తితో ముక్కలుగా చేసి, కుక్కర్‌లో ఉడకబెట్టినట్టు పోలీసులకు చెప్పాడు.
Crime News: అసలు గొడవకు కారణాలు చెప్పకుండా కట్టుకథలు అల్లినట్టు తెలుస్తున్నది. వెంకటమాధవి శరీర భాగాలు లభ్యంకాకపోవడంతో చిక్కుముడి వీడటం లేదు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే కేసు విషయంలో వేగంగా విచారిస్తున్న పోలీసులకు సెల్‌ఫోన్‌లో ఉన్న ఆ మహిళను విచారిస్తే అసలు విషయం బయటపడే అవకాశం ఉన్నది.
Crime News: హత్య ఘటన తెలియగానే వారు నివాసముండే భవనంలోని ఇతర కుటుంబాలు ఇండ్ల తాళాలు వేసి బంధువుల ఇండ్లకు వెళ్లిపోయారు. నిందితుడు చెప్పిన విషయాలనే కాకుండా పోలీసులు సొంత విచారణ కొనసాగిస్తున్నారు.
గురుమూర్తి, వెంకటమాధవి ఇద్దరిదీ ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జీపీ చెరువు గ్రామమే. వీరికి 13 ఏండ్ల క్రితమే వివాహం కాగా, ఒక కుమారుడు, ఒక కూతురు కలిగారు. గురుమూర్తి ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ పొంది, ప్రస్తుతం డీఆర్‌డీవోలో కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో జీపీ చెరువులో విషాదం అలుముకున్నది.