Crime News: వివాహేతర బంధాలు.. జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. ఇటీవల పెరిగిన ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒళ్లు గగుర్పొడిచే రీతిలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇండోర్ హనీమూన్ ఘటన తరహాలో తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. ఇది కూడా పెళ్లికి ముందే ఉన్న ప్రియుడితో కలిసి పెళ్లయిన నెలకే భర్తను దారుణంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Crime News: జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన తేజేశ్వర్ (32) ప్రైవేటు సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. తేజేశ్వర్‌కు ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న పెద్దలు వివాహం నిశ్చయించారు. పెళ్లి ఐదు రోజుల గడువు ఉందనగా, ఐశ్వర్య కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే కర్నూలు నగరంలోని ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉన్నదని, ఐశ్వర్య అతడి వద్దకే వెళ్లిపోయిందని అంతా భావించారు.
Crime News: అందరినీ ఆశ్యర్యపరుస్తూ ఫిబ్రవరి 16న ఐశ్యర్య ఇంటికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత వెంటనే తేజేశ్వర్‌తో ఫోన్‌లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి తన అమ్మ పడుతున్న ఇబ్బందులను చూడలేక, తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం.. అంటూ విలపిస్తూ నాటకమాడింది. దీంతో నిజమేనని తేజేశ్వర్ నమ్మాడు. ఆమెను పెళ్లాడేందుకు ఒప్పుకున్నాడు.
Crime News: అసలు కథ ఇప్పుడే మొదలైంది. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా, ఒప్పించి తేజేశ్వర్, ఐశ్వర్యను మే 18న వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ల నుంచి ఐశ్వర్య తన భర్త తేజేశ్వర్‌ను పట్టించుకోకుండా దూరం పెట్టసాగింది. నిత్యం ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. దీంతో పెళ్లయిన రెండో రోజు నుంచే ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ దశలో జూన్ 17న తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు. ఈ మేరకు అతని సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Crime News: గాలింపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాణ్యం పోలీసులకు తేజేశ్వర్ మృతదేహం దొరికింది. దీంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు.. ఐశ్వర్యపైనే అనుమానం వ్యక్తంచేశారు. ఈ మేరకు పోలీసులు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఐశ్వర్య తల్లి కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్‌గా పనిచేస్తున్నది. అదే బ్యాంకు ఉద్యోగితో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నదని తెలిసింది.
Crime News: తల్లితో వివాహేతర బంధం ఉన్న బ్యాంకు ఉద్యోగి ఐశ్వర్యతోనూ వివాహేతర బంధం పెట్టుకున్నట్టు సమాచారం. తేజేశ్వర్‌ను పెళ్లాడిన తర్వాత ఐశ్వర్య ఆ బ్యాంకు ఉద్యోగితో 2,000 సార్లు ఫోన్ మాట్లాడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ అడ్డు తొలగిస్తే అతని ఆస్తి కూడా తమ సొంతం అవుతుందని హత్యకు పథకం పన్నినట్టు సమాచారం.
Crime News: తేజేశ్వర్‌ను హత్య చేయించేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి కొందరికి సుపారీ ఇవ్వడమే కాక, తన డ్రైవర్‌ను వారి వెంట పంపినట్టు సమాచారం. ముందస్తు పథకం ప్రకారం.. కొందరు వ్యక్తులు జూన్ 17న తేజేశ్వర్‌ను కలిసి.. తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని, సర్వే కోసం రావాల్సిందిగా కోరారు. గద్వాలలో కారు ఎక్కించుకొని తీసుకెళ్తూ.. తేజేశ్వర్‌పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి దారుణంగా చంపేశారు. మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పడేసి వెళ్లిపోయారు. బ్యాంకు ఉద్యోగి పరారీలో ఉండగా, ఐశ్వర్య, సుజాతను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.