RS Praveen Kumar: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు హైదరాబాద్ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న సిట్ (SIT) చీఫ్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్‌పై ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమయ్యాయి.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో మాట్లాడుతూ.. సజ్జనార్‌పై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారిపై ఇలాంటి తీవ్రమైన విమర్శలు చేసినప్పుడు, దానికి సంబంధించిన ఆధారాలు చూపించకపోవడాన్ని పోలీసులు తప్పుబడుతున్నారు. విచారణ అధికారి ప్రతిష్టను దెబ్బతీసేలా, ప్రజల్లో అయోమయం సృష్టించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని పోలీసులు తమ నోటీసులో పేర్కొన్నారు.
ఈ నోటీసుల ప్రకారం.. సజ్జనార్‌పై ఉన్నాయంటున్న ఆ 7 కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రవీణ్ కుమార్ పోలీసులకు సమర్పించాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్ కాపీలు, చార్జ్షీట్లు లేదా కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏవైనా ఉంటే వాటిని వెంటనే చూపాలని కోరారు. కేవలం నోటి మాటతో ఆరోపణలు చేస్తే సరిపోదని, చట్టబద్ధమైన ఆధారాలు ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు.
నోటీసులు అందిన రెండు రోజుల్లోగా వీటికి సమాధానం ఇవ్వాలని పోలీసులు గడువు విధించారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా సరైన ఆధారాలు చూపించకపోతే, ఆయనపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పరువు నష్టం దావా వేయడంతో పాటు, తప్పుడు ప్రచారానికి సంబంధించి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు విచారణ ఎదుర్కొంటున్న తరుణంలో, ప్రవీణ్ కుమార్‌కు ఈ నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
