Cp sajjanar:మరిన్ని నాలుగు నుంచి ఐదు కొత్త బృందాలు

Cp sajjanar: డ్రగ్స్ నియంత్రణ చర్యల్లో భాగంగా, బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ (TGICC)లో శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలతో కలిసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అత్యున్నత స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ, సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తు మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే రౌడీషీటర్లపై ఏ స్థాయిలో నిఘా ఉంచుతారో, అదే స్థాయి నిఘాను డ్రగ్స్ నేరగాళ్లు, పెడ్లర్లపై కూడా కొనసాగిస్తున్నాం అని చెప్పారు.

నగరంలో మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ ను మూలాలు పీకి పారేయాలన్న ధ్యేయంతో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) ను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న బృందాలతో పాటు మరిన్ని నాలుగు నుంచి ఐదు కొత్త బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

మాదకద్రవ్యాల నిర్మూలన అనేది ఒకరోజులో ముగిసే కార్యక్రమం కాదని, ఇది నిరంతరంగా జరగాల్సిన పోరాటమని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాలు పరస్పర సహకారంతో పనిచేయాలని తాము సూచించినట్లు తెలిపారు.

ఇకపై ప్రతి నెలా అన్ని ఏజెన్సీలతో సమన్వయ సమావేశాలు నిర్వహించి, కేసుల పురోగతిని సమీక్షించనున్నట్లు చెప్పారు. డ్రగ్స్ నియంత్రణలో అత్యాధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించనున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశానికి ఐబీ, డీఆర్‌ఐ, ఎన్‌సీబీ, ఎక్సైజ్‌, కౌంటర్ ఇంటెలిజెన్స్‌, ఈగల్, ఎఫ్‌ఆర్‌ఆర్‌వో వంటి విభాగాల అధికారులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *