Hyderabad

Hyderabad: నేపాల్ ముఠా నయా స్కెచ్.. వెలుగులోకి మరో షాకింగ్ ఉదంతం.. మీ ఇంట్లో పనివారు వీరేనా?

Hyderabad: హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు, హత్యలు సామాన్య ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ‘నేపాలీ గ్యాంగ్’ పనిమనుషుల అవతారమెత్తి ఇళ్లకు కన్నాలు వేస్తోంది. కొద్దిరోజుల క్రితం ఒక మాజీ ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసిన ఘటన మరువక ముందే, తాజాగా కౌకూరులోని గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులను బంధించి, వారి ఇంట్లో భారీ దోపిడీకి పాల్పడటం ఇప్పుడు నగరంలో సంచలనంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్ష్మి దంపతుల ఇంట్లో ఒక నేపాలీ జంట పనిమనుషులుగా చేరుతోంది. వారిని నమ్మిన యజమానులు ఇంట్లోనే ఆశ్రయం కల్పించారు. సోమవారం రాత్రి “పుట్టినరోజు వేడుకలు” చేసుకుంటామని యజమానుల అనుమతి తీసుకున్న ఆ ముఠా, పక్కా ప్లాన్‌తో బయటి వ్యక్తులను లోపలికి రప్పించింది. యజమానులు భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా దాడి చేసి, వారిని కదలకుండా కట్టేసి భయభ్రాంతులకు గురిచేశారు.

తమ ప్రాణాలను కాపాడమని యజమానులు వేడుకోవడంతో, ఆ గ్యాంగ్ వారికి మత్తుమందు ఇచ్చి ఒక గదిలో బంధించింది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న 60 తులాల బంగారం, వెండి వస్తువులు మరియు రూ. 30 వేల నగదును దోచుకుని పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం మత్తు దిగిన యజమానులు కేకలు వేయడంతో, స్థానికులు వచ్చి వారిని రక్షించారు. ఈ దోపిడీలో సుమారు ఏడుగురు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ వరుస ఘటనల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. ఇంట్లో పనిమనుషులను చేర్చుకునే ముందు వారి పూర్తి వివరాలు, ఆధార్ కార్డులు సేకరించాలని మరియు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ‘వెరిఫికేషన్’ చేయించాలని కోరుతున్నారు. ముఖ్యంగా అపరిచితులను, నమ్మకం కుదరని వ్యక్తులను ఇంట్లోకి రానివ్వద్దని, వృద్ధులు ఒంటరిగా ఉన్న సమయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *