AUS vs IND: ఆస్ట్రేలియాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ ఆడలేకపోయాడు. తనయుడు జన్మించడంతో ఆలస్యంగా కంగారూ గడ్డపై అడుగుపెట్టిన అతడు ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌తో రెండు రోజుల మ్యాచ్‌లో పాల్గొన్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మిడిలార్డర్‌లో బరిలో దిగాడు. అడిలైడ్‌లో డేనైట్‌గా జరిగే రెండో టెస్టు లోనూ రోహిత్ మిడిలార్డర్‌లోనే ఆడతాడా? తన స్థానాన్ని రాహుల్‌కు త్యాగం చేస్తాడా? లేక ఎప్పటిలాగే ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడా? అన్న విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రోహిత్ స్థానం ఓపెనింగ్.. కానీ అతడు ఆలస్యంగా ఆస్ట్రేలియాకు రావడంతో తొలి టెస్టులో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించాడు.
AUS vs IND: ఈ జోడీ గొప్పగా క్లిక్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో రాణించలేకపోయినా రెండో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. విజయవంతమైన ఈ జోడీని రెండో టెస్టులో మేనేజ్‌మెంట్ మార్చే అవకాశం లేకపోవచ్చు. దీంతో ఆలస్యంగా జట్టును కలుసుకున్న రోహిత్ మూడో స్థానంలో రావాల్సి ఉంటుంది. లేకపోతే మిడిలార్డర్‌లో బరిలో దిగాల్సి రావొచ్చు. బొటన వేలి గాయంతో మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తొలి టెస్టులో ఆడలేకపోయాడు. ఇప్పుడు అతడు కూడా అందుబాటులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్‌తో మ్యాచ్‌లో బరిలో దిగిన అతడు హాఫ్ సెంచరీతో ఫామ్ చాటుకున్నాడు. గిల్ సాధారణంగా మూడో స్థానంలో ఆడతాడు. మరి రోహిత్ తుది జట్టులోకి వస్తే గిల్‌ను అదే స్థానంలో కొనసాగిస్తారా లేక రోహిత్‌ను ఆ స్థానంలో దించి శుభ్‌మన్‌ను మిడిలార్డర్‌లోకి పంపుతారా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు.
AUS vs IND: గులాబి బంతితో.. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగే రెండో టెస్టు భారత బ్యాటర్లకు పరీక్ష పెట్టనుంది. ముఖ్యంగా తొలి గంటలో క్రీజులో నిలవడం చాలా కీలకం. ఈ నేపథ్యంలో రోహిత్‌తో పోలిస్తే మంచి టెక్నిక్ ఉన్న శుభ్‌మన్‌నే మూడో స్థానంలో పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే చాన్నాళ్ల తర్వాత రోహిత్‌ను మిడిలార్డర్‌లో చూడొచ్చు. కెరీర్ ఆరంభంలో అతడు 5, 6 స్థానాల్లోనే బ్యాటింగ్‌కు వచ్చేవాడు. ఓపెనర్‌గా ప్రమోషన్ వచ్చిన తర్వాత విజయవంతమయ్యాడు. అతడు ఈ స్థానంలోనే ఎక్కువ పరుగులు సాధించాడు. అనుభవజ్ఞుడైన రోహిత్ లోయర్ ఆర్డర్‌లో దిగితే జట్టుకు మేలు చేస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మరి ఎప్పటిలాగే రోహిత్ కొత్త బంతిని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటే భారత జట్టు కాంబినేషన్ భిన్నంగా ఉండబోతోంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ ఆరంభించిన కేఎల్ రాహుల్ ఎప్పటిలాగే మిడిలార్డర్‌లో ఆడే అవకాశం ఉంది. పెర్త్ టెస్టులో మూడో స్థానంలో బరిలో దిగిన దేవ్‌దత్ పడిక్కల్ రాణించలేకపోయాడు. ఇప్పుడా స్థానాన్ని ఎప్పటిలాగే శుభ్‌మన్ గిల్ భర్తీ చేసే అవకాశాలున్నాయి. మరోవైపు గత కొంతకాలంగా రాహుల్ ఫామ్‌లో లేడు.
AUS vs IND: పెర్త్ టెస్టుతోనే అతడు ఓపెనర్‌గా దిగి రాణించాడు. మళ్లీ మిడిలార్డర్‌కు వెళ్లి అదే ఫామ్‌ను కొనసాగించగలడా అన్నదే జట్టును వేధిస్తోంది. పెర్త్ టెస్టులో ఆరో స్థానంలో వచ్చిన ధ్రువ్ జురెల్ రాణించలేకపోయాడు. రెండో టెస్టులో రోహిత్ లేదా రాహుల్ ఆ స్థానంలో బరిలో దిగాల్సి ఉంటుంది. రోహిత్ ఆడితే ఓపెనర్‌గా బరిలో దిగే అవకాశాలే ఎక్కువ. కానీ అంచనాలకు భిన్నంగా ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్ మ్యాచ్‌లో రోహిత్ మిడిలార్డర్‌లో ఆడాడు. దీన్నిబట్టి చూస్తే రెండో టెస్టులోనూ డౌన్ ది ఆర్డర్‌లోనే బరిలో దిగే అవకాశాలున్నాయి. మరి ఈ కొత్త కూర్పు వల్ల భారత జట్టుకు ఎలాంటి మేలు కలుగుతుందో చూడాలి.
AUS vs IND: కాగా, పింక్ బాల్‌తో జరుగనున్నఅడిలైడ్ టెస్టు కోసం ఇప్పటికే టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్టుతో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడి ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తిరిగి రావడంతో టీమిండియా మరింత పటిష్టంగా మారింది. మరోవైపు కాలికి బ్యాండేజీతో కోహ్లీ ప్రాక్టీస్ లో కనిపించడం రెండో టెస్టుకు ముందు టీమిండియా శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది. కాలికి బ్యాండేజీతో ఉన్న కోహ్లీ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ కుడి కాలి మోకాలి నొప్పితో ఇబ్బంది పడగా, మెడికల్ టీమ్ వచ్చి చికిత్స చేసి అనంతరం మోకాలికి బ్యాండేజీ వేసినట్లు తెలుస్తోంది.
AUS vs IND: ఒకవేళ రెండో టెస్టుకు విరాట్ దూరమైతే మాత్రం అది భారత జట్టుకు పెద్ద దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే అడిలైడ్ మైదానంలో కోహ్లీ అద్భుతమైన రికార్డుంది. ఇక్కడ ఆడిన నాలుగు టెస్టు మ్యాచుల్లో 8 ఇన్నింగ్స్‌ల్లో 63.62 సగటుతో ఏకంగా 509 రన్స్ చేశాడు. ఇక 2014లో జరిగిన టెస్టులోనైతే రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా సెంచరీలు నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 141 రన్స్ చేశాడు. కాగా రెండో టెస్టుకు హాజిల్‌వుడ్ దూరమైన నేపథ్యంలో ఆసీస్ మేనేజ్‌మెంట్ స్కాట్ బోలాండ్‌ను జట్టులోకి తీసుకువచ్చింది. అదే విధంగా.. మిచెల్ మార్ష్‌కు కవర్‌గా బ్యూ వెబ్‌స్టర్‌ను పిలిపించింది. దీంతో రెండు జట్ల తుది కూర్పుపై ఆసక్తి నెలకొంది.