Cold Wave

Cold Wave: తెలంగాణపై చలి పంజా.. రాబోయే మూడు రోజులు వణుకుడే.. జాగ్రత్త!

Cold Wave: రాష్ట్రంలో చలి పులి పంజా విసురుతోంది. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు గడ్డకట్టే చలితో వణికిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లోనే కాకుండా, ఉదయం 11 గంటల వరకు కూడా బయటకు రావాలంటే జనం భయపడే పరిస్థితి నెలకొంది. తాజాగా సంగారెడ్డి, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలకు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దాదాపు 12 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఈ ఏడాది చలి తీవ్రతను చూపిస్తోంది.

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న చల్లని గాలుల వల్ల ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్యే కొనసాగుతాయని తెలుస్తోంది. దీనివల్ల తెల్లవారుజామున మంచు కురవడమే కాకుండా, సాయంత్రం 5 గంటల నుంచే చలి గాలులు మొదలవుతున్నాయి. ఈ మార్పుల వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు త్వరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు, ఉదయాన్నే పనులకు వెళ్లేవారు స్వెటర్లు, మఫ్లర్లు ధరించడం తప్పనిసరి. చలి గాలుల ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో ఇంట్లోనే ఉండటం మంచిది. రాబోయే మూడు రోజులు వాతావరణంలో మార్పులు ఉంటాయని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *