CM Vijay: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దళపతి విజయ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రాధన్ పండిత్ వెట్రివేల్‌ను ప్రభుత్వంలో ఉన్నత పదవిలో నియమించారు. ఆయనను ముఖ్యమంత్రికి ‘ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ’ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం, రాధన్ పండిత్ ఇకపై అధికారికంగా ముఖ్యమంత్రికి రాజకీయ సలహాదారుగా వ్యవహరించనున్నారు.
ముహూర్తం మార్చిన జ్యోతిష్యుడు
నిజానికి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలోనే రాధన్ పండిత్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. మే 10వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రమాణస్వీకారం చేయాలని ముందుగా నిర్ణయించినప్పటికీ, రాధన్ పండిత్ ఇచ్చిన సలహా మేరకు ఆ సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్చారు. విజయ్ రాజకీయ ప్రస్థానంలో, ఆయన పార్టీ టీవీకే (TVK) సాధించిన విజయంలో రాధన్ పండిత్ సూచనలు కీలక పాత్ర పోషించాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జయలలిత కాలం నుంచే గుర్తింపు
రాధన్ పండిత్ జ్యోతిష్య రంగంలో సామాన్యుడు కాదు. గత నాలుగు దశాబ్దాలుగా ఆయన ఈ రంగంలో కొనసాగుతున్నారు. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కూడా ఆయన అత్యంత సన్నిహితంగా ఉండేవారు. జయలలిత తన కీలక నిర్ణయాలన్నింటినీ రాధన్ పండిత్‌ను సంప్రదించిన తర్వాతే తీసుకునేవారని చెబుతుంటారు. పెద్ద పెద్ద రాజకీయ నేతలు సైతం ఆయన సలహాల కోసం క్యూ కడుతుంటారని సమాచారం. తమిళనాడు ఎన్నికలకు ముందే విజయ్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన జ్యోస్యం చెప్పడం గమనార్హం.
విజయ్ నమ్మకం ఫలించేనా?
తనపై నమ్మకంతో ఒక జ్యోతిష్యుడిని అధికారిక సలహాదారుగా నియమించుకోవడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. విజయ్ రాజకీయ నిర్ణయాల్లో జ్యోతిష్య శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోంది. మరి రాధన్ పండిత్ సలహాలు విజయ్ పాలనలో ఎలాంటి మార్పులు తీసుకువస్తాయో, ప్రజల మద్దతును ఎలా కాపాడతాయో వేచి చూడాలి.
