Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు ఆయన ముఖ్యమైన సూచనలు చేశారు.
సీఎం రేవంత్ మాట్లాడుతూ, పార్టీ మరియు ప్రభుత్వం ఒకే దిశగా, సమన్వయంగా ముందుకెళ్లాలన్నారు. “పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లా పనిచేయాలి” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 18 నెలల పాలన కాలాన్ని గోల్డెన్ పీరియడ్‌గా అభివర్ణించారు.
బూత్ స్థాయి నుంచే బలం పెరగాలి
రేవంత్ రెడ్డి నేతలు, కార్యకర్తలకు సూచించిన ముఖ్యమైన అంశాల్లో ఇది ప్రధానంగా నిలిచింది. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే, ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరికి సమర్థవంతంగా తీసుకెళ్లగలమన్నారు. అందుకే గ్రామ, మండల, బూత్ స్థాయిల్లో కమిటీల ఏర్పాటు అనివార్యమన్నారు.
ఇది కూడా చదవండి: CM CHANDRABABU: పోలవరం-బనకచర్ల వల్ల తెలంగాణకు నష్టం ఉండదు
పనిచేసిన వారికే పదవులు
పార్టీకి కష్టకాలంలో తోడుగా నిలిచిన వారికే నామినేట్ పదవులు ఇవ్వబడినట్లు సీఎం తెలిపారు. మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల వంటి పదవులను భర్తీ చేయాలని సూచించారు. ఇకపై కూడా కేవలం పని చేసినవారికే పదవులు ఉంటాయని స్పష్టం చేశారు.
డిసిప్లిన్ కీలకం
నాయకులు క్రమశిక్షణతో వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. పార్టీ పటిష్టత కోసం అందరూ ఐక్యతతో ముందుకు రావాలని అన్నారు. గ్రౌండ్ లెవెల్‌లో పని చేయాలని, నాయకులు ప్రజల్లో ఉండాలని సూచించారు.
ముందున్న సవాళ్లు
రాబోయే రోజుల్లో డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలి ఎన్నికల వంటి ముఖ్యమైన సవాళ్లు ఎదురుకానున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తాను స్వయంగా గ్రామాల్లోకి వెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై దృష్టి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పార్టీని సిద్ధం చేయాలని సీఎం పిలుపునిచ్చారు. అంతా ఒకే లక్ష్యంతో పని చేస్తేనే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.