Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. నిజానికి ఫిబ్రవరి నుంచి ప్రచారం ప్రారంభించాలని భావించినప్పటికీ, సమయం తక్కువగా ఉండటంతో ఈ నెల 16వ తేదీ నుంచే రంగంలోకి దిగాలని సీఎం నిర్ణయించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనతో ఈ ప్రచార పర్వం మొదలుకానుంది. 16న సదర్‌మాట్ బ్యారేజీని ప్రారంభించి, అక్కడ నిర్వహించే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఆ తర్వాత చనాఖా-కోర్ట ప్రాజెక్టును కూడా ఆయన సందర్శించనున్నారు.
పర్యటనలో భాగంగా 17వ తేదీన జడ్చర్లలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి, మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. అదే రోజు సాయంత్రం పాలమూరులో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. 18న ఖమ్మం జిల్లాలో పర్యటించి కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతో పాటు, సీపీఐ వందేళ్ల ఉత్సవాలకు కూడా హాజరవుతారు. అనంతరం మేడారం చేరుకుని, 19వ తేదీ ఉదయం కొత్తగా నిర్మించిన సమ్మక్క-సారలమ్మ గద్దెలను ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పర్యటన ముగిసిన వెంటనే ఆయన దావోస్, అమెరికా పర్యటనలకు వెళ్లనున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతానికి పైగా స్థానాలను గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో చోట లక్ష మందితో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 3 నుంచి ఈ సభలు వరుసగా జరగనున్నాయి. ఈ సభల బాధ్యతలను ఆయా జిల్లాల ఇన్-ఛార్జ్ మంత్రులకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే మంత్రుల జాబితాను అధికారికంగా విడుదల చేయనున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎన్నికల్లో భారీ విజయం సాధించడమే ఈ సభల ప్రధాన ఉద్దేశం.
