Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్ వేదికగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి అత్యంత పవర్‌ఫుల్ ప్రసంగం చేశారు. గత రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో సాధించిన విజయాలను, ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను ఆయన ప్రజల ముందుంచారు.
ఇది నలుగురి చేతిలో అధికారం కాదు.. ప్రజా ప్రభుత్వం!
రాష్ట్రంలో కాంగ్రెస్‌పై ప్రజలు చూపిస్తున్న నిరంతర అభిమానానికి సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గత రెండున్నరేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ వైపే నిలబడ్డారు. ప్రజలు అందించిన ఈ ఆదరణ మాపై బాధ్యతను మరింత పెంచింది. ఈ రాజ్యాంగ అవకాశాన్ని మేము ఎన్నడూ కేవలం ఒక ‘అధికారంగా’ భావించలేదు. ప్రభుత్వం అంటే నలుగురి చేతిలో ఉండే అధికారం కాదు.. అది ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే వేదిక. గత పాలకుల రాచరిక ఆలోచనలను ఓడించి, ప్రజలు ఈ ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈ 30 నెలల పాలనలో ప్రజల ఆశలను, ఆశయాలను నెరవేర్చడంలో మేము సంపూర్ణ విజయం సాధించాం అని సీఎం స్పష్టం చేశారు.
అన్నదాతకు అండగా: “రైతులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తాం”
వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి పలు ఆసక్తికర గణాంకాలను పంచుకున్నారు:
-
2047 విజన్ డాక్యుమెంట్: మా ‘2047 విధాన పత్రం’లో రైతులకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చాం. రాబోయే రోజుల్లో రైతులను కేవలం సాగుకే పరిమితం చేయకుండా, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నాం. పేదల జీవన స్థితిగతులు ఎలా ఉంటాయో క్షేత్రస్థాయి నుండి వచ్చిన నాకు బాగా తెలుసు.
-
రూ.2 లక్షల రుణమాఫీ: రైతులకు అప్పుల భారాన్ని తగ్గించేందుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీని అమలు చేసి, ఏకంగా 25 లక్షల రైతు కుటుంబాలను అప్పుల ఊబి నుండి విముక్తులను చేశాం.
-
రికార్డు బడ్జెట్ & కొనుగోళ్లు: ఇప్పటివరకు కేవలం సంక్షేమ రంగాల కోసమే రికార్డు స్థాయిలో రూ.1.56 లక్షల కోట్లు కేటాయించాం. రాష్ట్రంలో ఈ ఏడాది 2.36 కోట్ల పన్నుల పంట దిగుబడులు రావడం గర్వకారణం. ఎన్నడూ లేని విధంగా జొన్న, మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. ఒక్క జొన్న కొనుగోళ్ల కోసమే రూ.1154 కోట్లు చెల్లించాం.
-
చివరి గింజ వరకు కొంటాం: వాతావరణం అనుకూలించక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, అన్నదాతల నుండి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. ఇందులో భాగంగానే ఇప్పటికే 10 వేల టన్నుల తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటివరకు పంట కొనుగోళ్లపై రైతులకు రూ.82 వేల కోట్లు నేరుగా చెల్లించాం.
సాగునీటి రంగం: ప్రాణహిత-చేవెళ్లకు పునర్జీవం!
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. “గత పదేళ్లలోనూ తెలంగాణలో సాగునీటి పరిస్థితి ఏమాత్రం మారలేదు. తెలంగాణ హక్కుల సాధన కోసం మేము అన్ని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాజీలేని పోరాటం చేస్తున్నాం. గతంలో నిర్లక్ష్యానికి గురైన ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టుకు మేము తిరిగి ప్రాణం పోస్తాం. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం వేగవంతం చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా విజ్ఞప్తి చేస్తున్నాం” అని వెల్లడించారు.
మహిళా శక్తి: కోటి మంది మహిళలను ‘కోటీశ్వరులు’ చేయడమే లక్ష్యం!
మా పాలన మొదలైందే ఆడబిడ్డల సంక్షేమంతో అని చాటిచెప్పిన సీఎం, మహిళా సాధికారతపై సంచలన ప్రకటనలు చేశారు.
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న బలమైన సంకల్పంతో మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తెలంగాణ మహిళలు ఇవాళ దేశానికే ఆదర్శంగా మారారు. మన ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు రాబోయే రోజుల్లో రూ.లక్ష కోట్ల రుణాలను అందించబోతున్నాం. ఇప్పటికే రూ.60 వేల కోట్ల విలువైన సున్నా వడ్డీ రుణాలను డ్వాక్రా మహిళలకు అందజేశాం. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు ఆర్టీసీ (TSRTC) లో ఇప్పటివరకు రూ.10 వేల కోట్ల విలువైన ప్రయాణాలు సాగించారు.
నిరుద్యోగులు & విద్యారంగంపై ఫోకస్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరుద్యోగ యువత చేసిన పోరాటాలను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్మరించుకున్నారు. యువత ఆకాంక్షలకు తగ్గట్టుగా ఉద్యోగ నియామకాల్లో మేము పూర్తి పారదర్శకతను తీసుకువచ్చాం. గతంలో లాగా పేపర్ లీకేజీలు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ఉద్యోగాల భర్తీని వేగవంతం చేస్తున్నాం. అలాగే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. కేవలం డిగ్రీలు ఇవ్వడమే కాకుండా, విద్యార్థుల్లో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాన్ని (Skills) పెంచే దిశగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం” అని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
