Revanth Reddy

Revanth Reddy: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్.. ఎన్టీఆర్‌ లేకుండానే నాయకులయ్యారా?

Revanth Reddy: నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) దేశం గర్వించదగిన అత్యంత గొప్ప నాయకుడని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తమ ప్రభుత్వం ఎన్టీఆర్, ఇందిరాగాంధీ ఆశయాల స్ఫూర్తితోనే ముందుకు సాగుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఇందిరాగాంధీ ఎంత ముఖ్యమో, తెలుగుజాతికి ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. అమీర్‌పేట మైత్రీవనం సర్కిల్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

దేశ చరిత్రలో స్ఫూర్తినింపిన ముగ్గురు గొప్ప నాయకులను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ సీఎం ఎన్టీఆర్.. ఈ ముగ్గురూ దేశానికి దొరికిన జాతిరత్నాలని అభివర్ణించారు. అంబేడ్కర్ మహిళలకు సమాన ఓటు హక్కు కల్పిస్తే, ఇందిరాగాంధీ భూసంస్కరణల ద్వారా పేదలకు మేలు చేశారని చెప్పారు. అలాగే ఎన్టీఆర్ తెలుగు ప్రజల్లో ఆత్మగౌరవాన్ని నింపి, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక మంచి కార్యక్రమాలు అమలు చేశారని గుర్తుచేశారు.

ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయి ఉండి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా ఆవిష్కరిస్తారంటూ కొందరు చేస్తున్న విమర్శలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఎన్టీఆర్ కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతమైన ప్రజా నాయకుడని, అందుకే హైదరాబాద్ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించామని చెప్పారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర జ్ఞాపకమని, దీనిపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తాను భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఆనాడు ఇందిరాగాంధీ తెలంగాణ నుంచి పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి వంటి గొప్ప నాయకులను దేశానికి అందిస్తే.. ఎన్టీఆర్ ఈ ప్రాంతం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, దేవేందర్ గౌడ్, మోత్కుపల్లి వంటి ఎందరో నాయకులను తయారు చేశారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆయన నేరుగా విమర్శలు గుప్పించారు. “కేసీఆర్‌కు అసలు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? ఎన్టీఆర్ నీడన పెరిగి, ఆయన వల్లనే నాయకులైన మీరు.. ఈ రోజు ఎన్టీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఆయన ఆశీస్సులు లేకపోతే మీరు నాయకులు అయ్యేవారా?” అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పెట్టిన రాజకీయ భిక్షతో ఎంతో మంది సామాన్యులు పాలకులుగా మారారని, గ్రామాల్లో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేదలకు విముక్తి కల్పించిన మహానీయుడు ఎన్టీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *