Revanth Reddy

Revanth Reddy: కిషన్‌రెడ్డి వెనుక కేటీఆర్‌ ఉన్నారు.. హైదరాబాద్ మెట్రోపై కేంద్రం ఘోర వివక్ష!

Revanth Reddy: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర రవాణా రంగానికి మకుటాయమానమైన మెట్రో రైల్ ప్రాజెక్ట్ విస్తరణపై రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మెట్రో ఫేజ్-2 విస్తరణ అనుమతులు మరియు ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) లోన్ నిధుల బదిలీని కేంద్ర ప్రభుత్వం తొక్కేస్తోందంటూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అడ్డంకుల వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుట్రలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వైఫల్యాలు ఉన్నాయంటూ సీఎం ధ్వజమెత్తారు.

కిషన్ రెడ్డి వెనుక కేటీఆర్ స్క్రీన్ ప్లే:

మెట్రో ఫేజ్-2 అభివృద్ధిని అడ్డుకోవడంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

“కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సొంతంగా అంత తెలివి లేదు. కేటీఆర్ వెనుక ఉండి కుట్రలు చేస్తుంటే.. కిషన్ రెడ్డి దాన్ని ఢిల్లీలో అమలు చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్‌లకు లొంగిపోయి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుపడుతున్నారు” అని రేవంత్ ఘాటుగా విమర్శించారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కేసీఆర్ లోపాయికారీగా సహకరించినందుకు.. కిషన్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి ‘గురుదక్షిణ’ చెల్లిస్తూ మెట్రో ప్రాజెక్టును తొక్కుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు.

రూ.13,600 కోట్ల లోన్‌ను ఆపేశారు – అసలేం జరిగిందంటే:

గత కేసీఆర్ పాలనలో మెట్రో విస్తరణ సరిగ్గా జరగలేదని, దానివల్ల రూ.15 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ఫేజ్-1 వ్యయం రూ.22 వేల కోట్లకు పెరిగిందని సీఎం వివరించారు. ఏడాదికి రూ.400 కోట్ల నష్టం వస్తోందని ఎల్‌అండ్‌టీ (L&T) చేతులెత్తేయడంతో రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుంది.

రూ.30 వేల కోట్ల విలువైన ఎల్‌అండ్‌టీ ఆస్తులను రూ.15 వేల కోట్లకే ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఎల్‌అండ్‌టీకి ఉన్న రూ.13,600 కోట్ల అప్పును తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) నుండి కేవలం 4 శాతం వడ్డీకే రుణం ఇప్పించాము.

  • రేవంత్ రెడ్డి గనుక ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తే తెలంగాణలో బీజేపీ మనుగడ కష్టమవుతుందని కిషన్ రెడ్డి భయపడ్డారు. అందుకే సహచర కేంద్రమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్‌లకు తప్పుడు సమాచారం ఇచ్చి.. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా ఆ లోన్ డబ్బులు ఎల్‌అండ్‌టీకి ట్రాన్స్‌ఫర్ కాకుండా కిషన్ రెడ్డే అడ్డుకున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు.

హైదరాబాద్‌పై కేంద్రం ఘోర వివక్ష:

మెట్రో రైలు ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లకు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

  • మనకెందుకు ఇవ్వరు?: “అహ్మదాబాద్ మెట్రోకు అనుమతులు, నిధులు వస్తాయి. విశాఖపట్నం మెట్రో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. జపాన్ నుంచి నిధులు వచ్చినా హైదరాబాద్‌కు మాత్రం ఎందుకు తొక్కేస్తున్నారు? కేంద్రానికి ఎంతటి వివక్ష ఉందో ఇక్కడే అర్థం అవుతోంది. మెట్రోలో ప్రయాణించాలని ప్రధాని మోదీ సూచిస్తున్నారు.. మేము ఆ సూచనను ఇంప్లిమెంట్ చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు?” అని రేవంత్ ప్రశ్నించారు.

  • ఛాలెంజ్ విసిరిన సీఎం: మెట్రో ఫేజ్-1ను పూర్తిగా స్వాధీనం చేసుకుని, ఫేజ్-2ను నిర్మించడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. కేంద్రం గనుక ఎన్ఓసీ (NOC) ఇచ్చి నిధులు ఇప్పిస్తే కిషన్ రెడ్డికి శాలువా కప్పి సన్మానిస్తామన్నారు. “ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ఖాతాలో రూ.15 లక్షల హామీలు నెరవేర్చలేదు.. వాటన్నింటికీ బాధ్యత వహిస్తూ మోదీ రాజీనామా చేస్తే.. మేము కూడా చేస్తాం” అంటూ రేవంత్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *