Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి, ఐటీ రంగ ప్రాధాన్యత, భవిష్యత్తు ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల శంకుస్థాపన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు హాజరయ్యారు.
ఐటీ రంగానికి రాజీవ్ గాంధీ పునాది
‘‘రాజీవ్ గాంధీ దూరదృష్టితోనే ఐటీ రంగంలో ఈ స్థాయి అభివృద్ధి సాధ్యమైంది. నేడు గూగుల్ వంటి అంతర్జాతీయ కంపెనీల్లో తెలుగువారు కీలక స్థానాలు దక్కించుకున్నారు. అమెరికాలో మన ఐటీ నిపుణులు పని చేయకపోతే అక్కడి పరిశ్రమలు స్తంభిస్తాయి’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిలో పూర్వ సీఎంల పాత్ర
1994 నుంచి 2014 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి బలమైన పునాది వేశారని ఆయన గుర్తుచేశారు. హైటెక్ సిటీ నిర్మాణం సమయంలో వ్యంగ్యాలు, అవహేళనలు ఎదురైనా, నేడు హైదరాబాద్ సింగపూర్, టోక్యోతో పోటీ పడుతోందని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Russia: ఇండియాకు రష్యా బంపర్ ఆఫర్.. చమురు కొనుగోలుపై 5శాతం డిస్కౌంట్!
మూసీ ప్రక్షాళన – పేదలకు ఊరట
మూసీ నది శుద్ధి కార్యక్రమాన్ని అడ్డుకోవడం అన్యాయం అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పేదలు మురికిలో ఎందుకు బతకాలి? మూసీ ప్రక్షాళన జరిగితే నగరానికి కొత్త ఊపిరి వస్తుంది. ఓల్డ్ సిటీ అనేది వాస్తవానికి ఒరిజినల్ సిటీ. మూసీ ప్రక్షాళనతో ఆ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొస్తాం’’ అని స్పష్టం చేశారు.
భవిష్యత్తు దిశ – తెలంగాణ రైజింగ్ 2047
‘‘రాబోయే పదేళ్లలో తెలంగాణను వన్ బిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దుతాం. మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ ప్రక్షాళన – ఇవన్నీ తెలంగాణ రైజింగ్ 2047 భాగమే. నగర అభివృద్ధిని అడ్డుకునేవారు ప్రజలే అడ్డుకోవాలి’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఆధునిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సరైన సౌకర్యాలు లేవని సీఎం గుర్తు చేశారు. ‘‘ప్రభుత్వానికి ఒక్క రూపాయి భారమూ లేకుండా ఆధునిక సౌకర్యాలతో కొత్త కార్యాలయాలు నిర్మించనున్నాం’’ అని తెలిపారు.