Revanth Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై విమర్శలు గుప్పించిన కవిత, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ సంతోష్‌రావును నేరుగా టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేదా బీజేపీ ఉన్నారని కొన్ని వర్గాలు ఆరోపించాయి.
ఈ పరిణామాలపై సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఘాటుగా స్పందించారు. “మీ కుటుంబ కలహాల్లో మమ్మల్ని లాగకండి. మేము అలాంటి వారితో సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. అలాంటి వారిని మేమెందుకు వెనుకనుంచుకుంటాం? నేను ఎప్పుడూ ప్రజల వెనుక ఉంటాను, పనికిమాలిన రాజకీయాల వెనుక కాదు,” అని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Venezuela: యూఎస్‌కు డ్రగ్స్‌తో వస్తున్న బోటుపై దాడి.. 11 మంది మృతి
ఒకప్పుడు బలమైన స్థానం ఉన్న జనతా పార్టీ, తర్వాత తెలుగు దేశం పార్టీ కూడా కొన్ని రాజకీయ కుట్రలతో క్షీణించాయని గుర్తుచేసిన రేవంత్, “దుర్మార్గాలు చేసిన బీఆర్‌ఎస్ కూడా కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం” అని వ్యాఖ్యానించారు.
కవిత తనపై జరిగిన అన్యాయంపై ఘాటైన వ్యాఖ్యలు చేసినప్పటికీ, రేవంత్‌రెడ్డి మాత్రం ఈ వివాదాలకు తాను సంబంధం లేదని స్పష్టం చేశారు. “హరీశ్‌రావు వెనుక రేవంత్ ఉన్నారని, కవిత వెనుక రేవంత్ ఉన్నారని అంటున్నారు. నేను ఎవరి వెనుకా లేను. మీ కుల, కుటుంబ పంచాయితీల్లో మమ్మల్ని లాగవద్దు,” అని సీఎం స్పష్టం చేశారు.