CM Chandrababu

CM Chandrababu: కానిస్టేబుల్ నియామకాలు: యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం – సీఎం చంద్రబాబు

CM Chandrababu: యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుందని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మంగళగిరి ఏపీఎస్పీ పరేడ్ మైదానంలో నియామక పత్రాలు అందజేసిన అనంతరం ఆయన ప్రసంగించారు.

కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు దాదాపు నాలుగేళ్లుగా నిరీక్షించారని, నోటిఫికేషన్‌పై నమోదైన కేసులను సైతం పరిష్కరించి, ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని సీఎం పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని, వేరే ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు పోతాయని ఆయన స్పష్టం చేశారు. గతంలో తన పాలనలో 23 వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు, మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వం కేవలం ఎన్నికల ముందు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చిందని, తాము కానిస్టేబుల్ నియామకాలను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. విశాఖ సమ్మిట్‌లో కుదిరిన ఒప్పందాల ద్వారానే 11 లక్షల మందికి, మొత్తంగా 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

శాంతిభద్రతల విషయంలో ఏనాడూ రాజీపడలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఒకప్పుడు రాయలసీమలో ముఠా రాజకీయాలు, పాతబస్తీలో మత ఘర్షణలు తీవ్రంగా ఉండేవని, వాటిని తానే అణచివేశానని గుర్తు చేసుకున్నారు. తీవ్రవాదాన్ని ఉపేక్షించలేదని, అందుకే తనపై క్లైమోర్ మైన్స్‌తో దాడులు కూడా జరిగాయని చెప్పారు. మహిళల జోలికి వస్తే కఠినంగా వ్యవహరించి, తాటతీస్తామని పోలీసులు చెప్పాలని ఆయన దిశానిర్దేశం చేశారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో పోలీస్ వ్యవస్థ సరిగా లేదని అభిప్రాయపడిన సీఎం, కొత్తగా నియమితులైన కానిస్టేబుళ్లను చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలపై మరింత భరోసా కలిగిందని వ్యాఖ్యానించారు.

Also Read: Sydney Shooting: సిడ్నీ ఉగ్రదాడి ఘటన: నిందితుడికి హైదరాబాద్‌లో మూలాలు

ఇదే సభలో, కానిస్టేబుల్‌గా ఎంపికైన బాబూరావు అనే యువకుడు తన స్వగ్రామమైన తిమ్మలబండ-వెలుగురాతిబండ మధ్య రోడ్డు లేదని ముఖ్యమంత్రికి విన్నవించారు. బాబూరావు విజ్ఞప్తిని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తెలియజేయగా, ఆయన వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణానికి రూ. 3.90 కోట్లు మంజూరు చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

రాజకీయ ముసుగులో నేరాలు చేసే ‘పొలిటికల్ రౌడీలు’ తయారయ్యారని, ఈ విషయంలో పోలీస్ వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇక వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావన తీసుకొస్తూ, 2019 ఎన్నికల ముందు వివేకా గుండెపోటుతో చనిపోయారని నమ్మానని, కానీ అది హత్య అని తరువాత తెలిసిందని అన్నారు. సంఘటన జరిగినప్పుడు రక్తపు మరకలు కడిగేసిన విషయాన్ని సీఐ దాచిపెట్టారని, మరుసటి రోజు ‘నారాసుర రక్తచరిత్ర’ అని ప్రచారం చేసి, ప్రజలను నమ్మించారని ఆరోపించారు. ఆ రోజు తాను అప్రమత్తంగా ఉండి ఉంటే ఎన్నికల్లో ఓడిపోయేవాడిని కాదని అభిప్రాయపడ్డారు.

మొత్తం 5,757 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత పాల్గొన్నారు. కొత్తగా నియమితులైన కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి తొమ్మిది నెలల శిక్షణ ప్రారంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *