Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా చామవరంలో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గత వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే.. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలోని ప్రగతి, భవిష్యత్ ప్రణాళికలను ప్రజల ముందుంచారు.
గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు మిగిల్చింది
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం పూర్తిగా అస్తవ్యస్తం చేసిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. “గత పాలకులు రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల అప్పులు, మరో లక్ష కోట్ల బకాయిలు మిగిల్చి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేశారు. అయినప్పటికీ మేము ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో భారీగా పెన్షన్లు ఇస్తున్నాం. గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే దాన్ని రద్దు చేసేవారు, కానీ మా ప్రభుత్వం వచ్చాక 3 నెలల వరకు పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పించాం” అని సీఎం వివరించారు.
జగన్ ‘బటన్ నొక్కుడు’ విధానంపై ఘాటు కౌంటర్
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గతంలో అనుసరించిన సంక్షేమ శైలిపై చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నేను కూడా ఒక ఆఫీసులో కూర్చుని కేవలం బటన్ నొక్కవచ్చు. కానీ, బటన్ నొక్కితే అందులో ఆనందం ఉండదు.. కేవలం పైశాచిక ఆనందమే ఉంటుంది. అందుకే నేను స్వయంగా ప్రజల వద్దకు వచ్చి పెన్షన్లు అందిస్తూ, సంక్షేమ పథకాల అమలు తీరును, మీ కష్టాలను అడిగి తెలుసుకుంటున్నాను. పింఛన్ల కోసం ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా నేరుగా ఇంటింటికే అందిస్తున్నాం.
సూపర్ సిక్స్ పథకాలపై స్పష్టత.. మహిళలకు 33% సీట్లు!
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కీలక పథకాల పురోగతిని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు:
-
తల్లికి వందనం: ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేస్తున్నాం. బడులు తెరవగానే ఈ పథకం డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తాం.
-
ఉచిత గ్యాస్ సిలిండర్లు: ప్రస్తుతం అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ, మహిళలపై భారం పడకుండా ఏడాదికి 3 ఉచిత సిలిండర్లను అందిస్తున్నాం.
-
మహిళా సాధికారత: రాబోయే రోజుల్లో అసెంబ్లీలో మహిళలకు 33 శాతం సీట్లు ఇచ్చి, వారు రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తాం.
-
పీ4 (P4) కార్యక్రమం: సమాజంలో దిగువన ఉన్న అన్ని పేద కుటుంబాలను పైకి తీసుకురావడమే మా లక్ష్యం. పీ4 కార్యక్రమం కింద ఒక్కో కుటుంబానికి 3 నుండి 4 సంక్షేమ పథకాలను అందిస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నాం.
విశాఖకు రూ.15 లక్షల కోట్ల గూగుల్ ఇన్వెస్ట్‌మెంట్!
రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనపై సీఎం చంద్రబాబు భారీ రికార్డులను పంచుకున్నారు. “కేవలం ఈరోజు బాగుంటే చాలు అని మేము భావించడం లేదు.. ఏపీ భవిష్యత్ అద్భుతంగా ఉండాలనే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. ఇందులో భాగంగానే రాష్ట్రానికి రికార్డు స్థాయిలో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించాం. విశాఖపట్నంలో ప్రముఖ దిగ్గజ సంస్థ ‘గూగుల్’ (Google) రూ.15 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టబోతోంది. యువత ఈ ఉద్యోగాలను అందుకోవడానికి వీలుగా ఏడాదికి 25 వేల మందికి స్కిల్ డెవలప్‌మెంట్ (నైపుణ్య శిక్షణ) ఇస్తున్నాం” అని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం తాను, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కలిసి ఆలోచిస్తూ ముందడుగు వేస్తున్నామని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే మూడు పార్టీలు కలిసి జట్టు కట్టి ఎన్నికల్లో విజయం సాధించామని గుర్తుచేశారు.
“వైసీపీవన్నీ అసత్య ప్రచారాలు.. విగ్రహాల ధ్వంసం వారి కుట్రే”
వైసీపీ శ్రేణులు రాష్ట్రంలో మత విద్వేషాలు, అరాచకాలు సృష్టించాలని చూస్తున్నాయని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. “గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం మెగా డీఎస్సీ (DSC) నిర్వహించి పోస్టులు భర్తీ చేస్తుంటే వారు ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు. తిరుమలలో భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తుంటే.. అక్కడ మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటూ కుట్రలు పన్నారు. కానీ తనిఖీల్లో ఆ పార్టీ నేతలే అడ్డంగా బుక్కయ్యారు. ఆ గొడ్డలి పార్టీ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తోంది. నంద్యాలలో వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ నేతలేనని తేలింది, కానీ దాన్ని టీడీపీపై నెట్టాలని చూశారు. చంద్రబాబు పాలనలో ఇలాంటి అరాచక శక్తులకు, దుర్మార్గులకు చోటు లేదు” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఆరోగ్యాంధ్రప్రదేశ్ – అమరావతిలో యోగా వేడుకలు
రాష్ట్రాన్ని ‘ఆరోగ్యాంధ్రప్రదేశ్’గా మార్చడమే తమ ధ్యేయమన్నారు. గతేడాది నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమం విజయవంతం అయిందని, ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను రాష్ట్ర రాజధాని అమరావతి కేంద్రంగా అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజలంతా రోజుకు కనీసం అరగంట పాటు వ్యాయామం చేస్తే అనారోగ్య సమస్యలు రావని, అందరి జీవన ప్రమాణాలు పెరగాలనేదే తన కల అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
