Chandrababu Naidu

Rajya Sabha: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. ముగ్గురు నేతల పేర్లను ప్రకటించిన చంద్రబాబు

Rajya Sabha: ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు వెళ్లే తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థులు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. గత కొన్ని రోజులుగా పార్టీలో జరిగిన సుదీర్ఘ చర్చలు, కసరత్తుల తర్వాత అధినేత నారా చంద్రబాబు నాయుడు ముగ్గురు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ఖరారు చేశారు. టీడీపీ తరఫున పెద్దల సభకు వెళ్లే అభ్యర్థులుగా చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీస్‌ల పేర్లను పార్టీ ప్రకటించింది. రాజ్యసభ సీట్ల కోసం పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు పోటీ పడినప్పటికీ, సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు వీరిని ఎంపిక చేశారు.

నిజానికి ఏపీ నుంచి కూటమి తరఫున నలుగురు అభ్యర్థులు రాజ్యసభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు సీట్లను టీడీపీ, ఒక సీటును జనసేన పంచుకున్నాయి. జనసేన తరఫున అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవలే ప్రకటించారు. దీనితో శనివారం నాడే లింగమనేని రమేష్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను కూడా సమర్పించారు. ఇక మిగిలిన మూడు స్థానాలకు టీడీపీ శనివారం రాత్రి వరకు చర్చలు జరిపి తమ అభ్యర్థులను ఖరారు చేసింది.

రాజ్యసభ సీట్లు ఆశించిన పలువురు నేతలు శనివారం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి చంద్రబాబును కలిశారు. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే చంద్రబాబు ఈ ముగ్గురి పేర్లను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అధికారిక ప్రకటన రావడంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకారం టీడీపీ అభ్యర్థులుగా ఎంపికైన చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్‌లు సోమవారం (జూన్ 8న) తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. కూటమికి అసెంబ్లీలో పూర్తి మెజారిటీ ఉండడంతో ఈ నలుగురి ఎన్నిక ఏకగ్రీవం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *