CM Chandrababu: కృష్ణా నది జలాలతో కళకళలాడుతున్న శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం పర్యటించారు. జూలై తొలివారంలోనే ప్రాజెక్టు నిండటం పట్ల ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన సీఎం, కృష్ణా నదికి స్వయంగా జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులతో కలిసి ప్రాజెక్టు గేట్లను ఎత్తిన చంద్రబాబు, “నా జీవితంలో ఈ రోజు చాలా సంతోషకరమైనది. జూలై తొలివారంలోనే శ్రీశైలం నిండటం శుభపరిణామం” అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం శ్రీశైలంలో 200 టీఎంసీలకు పైగా జలాలు ఉన్నాయని తెలిపారు. రాయలసీమను ‘రతనాల సీమ’గా మార్చాలని మల్లన్నను ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు. మల్లన్న ఆశీస్సులతో రాయలసీమ సుభిక్షంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
జలాలే నిజమైన సంపదని, వాటితోనే రైతుల కష్టాలు తీరుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించారు. గతంలో చాలామంది రాయలసీమను ఎవరూ కాపాడలేరని అన్నారని గుర్తుచేస్తూ, రాయలసీమ స్థితిగతులు మార్చేందుకు దివంగత ఎన్టీఆర్ నడుం బిగించారని తెలిపారు. తాను కూడా రాయలసీమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని, సాగునీటి ప్రాజెక్టులకు గతంలో రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. గత ప్రభుత్వం రాయలసీమను పట్టించుకోలేదని ఆరోపించారు. జీడిపల్లికి నీరు తీసుకెళ్లే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు, గాలేరు-నగరి, గండికోట వంటి ప్రాజెక్టులన్నీ తామే తెచ్చామని గుర్తుచేశారు. తాము చేసిన అభివృద్ధిని హైదరాబాద్‌లో కొనసాగిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ నెల 15 నాటికి జీడిపల్లికి, 30 నాటికి కుప్పం, మదనపల్లెకు నీళ్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
Also Read: Disha Patani: అద్దం ముందు అందాల ఆరబోతతో కైపెక్కిస్తున్న దిశా!
పోలవరంతో రాయలసీమకు జలాలు:
సముద్రంలో కలిసే నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకుంటే మంచిదని, దానివల్ల రైతులకు మేలు జరుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే దానికి పోలవరం ప్రాజెక్టే కారణమని స్పష్టం చేశారు. సముద్రంలోకి వెళ్లే నీరు, వరద జలాలను వాడుకుంటే అందరికీ మంచిదని ఆయన పునరుద్ఘాటించారు. రాయలసీమకు ఏం చేయాలో తన వద్ద ఒక ‘బ్లూప్రింట్’ ఉందని, దేశంలో ఎక్కడా లేని రోడ్ల వ్యవస్థ రాయలసీమలో ఉందని పేర్కొన్నారు.
వ్యవసాయంతో పాటు ఆరోగ్యంపైనా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. తమ కాలంలో రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాలు తినేవారమని, ఇప్పుడు పాలిష్ చేసిన బియ్యం తిని చాలామంది షుగర్ వ్యాధి తెచ్చుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం అందరూ ఆరోగ్యంపై దృష్టి పెడుతూ చిరుధాన్యాలను తింటున్నారని, కూరగాయలు, పండ్ల వినియోగం పెరుగుతోందని చెప్పారు. అన్నిరకాల పండ్లు పండే ప్రాంతం రాయలసీమ మాత్రమేనని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక హబ్‌లుగా మారుతున్నాయని కూడా ఆయన వెల్లడించారు.