Chandrababu: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పీవీ కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తుచేశారు. ఢిల్లీలో జరిగిన “లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ” అనే పీఎం లెక్చర్ సిరీస్ ఆరో ఎడిషన్ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, పీవీ చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ
1990లలో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల్లో పడినప్పుడు పీవీ నరసింహారావు తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు దేశానికి మార్గదర్శకమయ్యాయని చంద్రబాబు అన్నారు. లైసెన్స్ రాజ్ నిబంధనలను రద్దు చేసి, పెట్టుబడిదారులు సులభంగా పెట్టుబడులు పెట్టేలా మార్పులు చేశారని తెలిపారు.
ఆర్థిక సంస్కరణల వల్లే దేశంలో ఐటీ విప్లవానికి పునాది పడిందని చంద్రబాబు కొనియాడారు. మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపినా, పీవీ ఎంతో లౌక్యంగా వ్యవహరించి అనేక పార్టీల నేతలను ఒప్పించి ఆర్థిక సంస్కరణలను అమలు చేశారని అన్నారు.
వాజ్‌పేయీ, మోదీ సంస్కరణల కొనసాగింపు
పీవీ ప్రారంభించిన సంస్కరణలను మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ కొనసాగించారని చంద్రబాబు గుర్తుచేశారు. వాజ్‌పేయీ కాలంలోనే హైవేలు, ఎయిర్‌పోర్ట్‌లు, పోర్టులు అభివృద్ధి చెందాయని చెప్పారు.
టెలికాం రంగం విస్తరణకు కూడా వాజ్‌పేయీ తీసుకున్న చర్యలే కారణమని, అందుకే నేటి యువత చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్నదని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రస్తుతం ప్రధాని మోదీ కూడా అనేక సంస్కరణలను అమలు చేస్తూ, భారత్‌ను ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపారని చంద్రబాబు తెలిపారు. మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు.
పీవీ అందరికీ ఆదర్శం
పీవీ నరసింహారావు 17 భాషలు నేర్చుకొని, ప్రధాని, కేంద్రమంత్రి, ఉమ్మడి ఏపీ సీఎంగా సేవలందించారని చంద్రబాబు గుర్తుచేశారు. “పీవీ అందరికీ ఆదర్శం. ఆయన తీసుకున్న సంస్కరణలే నేటి భారత అభివృద్ధికి పునాది” అని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.