Cm chandrababu: పోలీస్ నియామకాల ప్రక్రియను అడ్డుకునేందుకు తమ ప్రభుత్వంపై మొత్తం 31 కేసులు వేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అనేక అడ్డంకులు, న్యాయపరమైన చిక్కులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి ఉద్యోగాలు ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు.
ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని, అయినా యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వం మాట ఇచ్చినట్లుగానే పోలీస్ శాఖలో 23 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నప్పుడే ఉద్యోగాల కల్పన సాధ్యమని తాము ప్రజలకు స్పష్టంగా చెప్పామని సీఎం గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఉంటేనే ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.
వేరే వారు అధికారంలోకి వస్తే కొత్త ఉద్యోగాలు రావడం కాకుండా, ఉన్న ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
తమ పాలనలో ఇప్పటివరకు 4 లక్షల 51 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని చంద్రబాబు వెల్లడించారు. యువత భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

