Cm chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “స్వర్ణాంధ్ర విజన్ 2047” పేరుతో విస్తృత స్థాయి అభివృద్ధి ప్రణాళికను రూపొందించింది. ఏడాదిలోనే ఊహించినదానికంటే అధికమైన అభివృద్ధి సాధించామని సీఎం చెప్పారు. సమిష్టిగా పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక రంగాల్లో పురోగతిని నమోదు చేస్తోంది. ఏడాదిలోనే 16,347 ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. భూ సమాచారం చేయకుండా భవిష్యత్తులో భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ. 12,500 కోట్లు మంజూరు చేయగా, అమరావతికి రూ.15,000 కోట్లు కేంద్ర సహకారంతో లభించాయి. రాబోయే సంవత్సరాల్లో రైల్వే జోన్ పనులు పూర్తి అవుతాయని సీఎం తెలిపారు. 2027 జూన్ లేదా డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
“దీపం 2” పథకం ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయనున్నారు. పోలవరం నీటిని ఈ ఏడాదిలోనే అనకాపల్లి వరకు తీసుకువెళ్తామని తెలిపారు. అలాగే విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.
బనకచర్ల ప్రాజెక్టును గేమ్ ఛేంజర్గా అభివర్ణించిన చంద్రబాబు, గోదావరి నీళ్ల వినియోగంపై స్పష్టత ఇచ్చారు. గోదావరిలో నుంచి ఏటా సముద్రంలోకి పోతున్న 3 వేల TMCల నీటిలో, ఏపీకు 200 TMCలు, తెలంగాణకు 200 TMCలు మాత్రమే వాడుకునే హక్కు ఉందని పేర్కొన్నారు.
సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు “P4 విధానం” (People, Public, Private, Partnership) అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమైంది.
ఈ ఏడాది ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.