Rammohan Naidu

Rammohan Naidu: అజిత్ పవార్ ప్రమాదంపై క్లారిటీ ఇచ్చిన రామ్మోహన్ నాయుడు.. కారణం అదేనట!

Rammohan Naidu: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దురదృష్టకర ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రమాదం ఎలా జరిగింది? దానికి గల కారణాలేమిటి? అనే అంశాలపై ఆయన ప్రాథమిక సమాచారాన్ని మీడియాకు వివరించారు. ఈ ప్రమాదంపై లోతైన విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.

మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. విమానం బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన సమయంలో వాతావరణం ఏమాత్రం అనుకూలించలేదు. మంచు లేదా పొగమంచు కారణంగా విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. ఆ సమయంలో రన్‌వే సరిగ్గా కనిపిస్తుందా? లేదా? అని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు పైలట్లను అడిగారు. దారి సరిగ్గా కనిపించడం లేదని పైలట్లు చెప్పడంతో, విమానాన్ని సురక్షితంగా గాల్లోనే మరికొంత సేపు తిప్పాలని (Go-around) అధికారులు సూచించారు.

కొంత సమయం తర్వాత రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పుడు, రన్‌వే కనిపిస్తోందని పైలట్లు సమాధానం ఇచ్చారు. దీంతో విమానాన్ని కిందకు దించేందుకు ఏటీసీ అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే, దురదృష్టవశాత్తూ ల్యాండింగ్ సమయంలోనే విమానం ప్రమాదానికి గురై కూలిపోయింది. ఈ క్రమంలో ఏం జరిగిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతం ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోంది. విమానయాన రంగ నిపుణులు కూడిన డీజీసీఏ (DGCA) మరియు ఏఏఐబీ (AAIB) బృందాలు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలు లేదా ఇతర లోపాలను ఈ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయని, దర్యాప్తులో తేలిన విషయాలను పారదర్శకంగా వెల్లడిస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *