China Population Crisis: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటిగా పేరున్న చైనాలో ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. 2025లో కూడా చైనా జనాభా వరుసగా నాలుగో సంవత్సరం తగ్గడం ఆ దేశ అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మరియు విధాన నిర్ణేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా, ఎన్ని చట్టాలు మార్చినా జనాభా క్షీణత వేగం తగ్గకపోవడం గమనార్హం.
రికార్డు స్థాయిలో తగ్గిన జననాలు
తాజా అధికారిక గణాంకాల ప్రకారం, గత ఏడాది చైనా జనాభా 3.39 మిలియన్ల మేర తగ్గింది. 2025లో కేవలం 7.92 మిలియన్ల మంది మాత్రమే జన్మించారు. ఇది 2024తో పోలిస్తే ఏకంగా 17 శాతం తక్కువ. 1949లో చైనా గణతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత ఇంత తక్కువ స్థాయిలో జననాలు నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు వృద్ధాప్యం పెరగడంతో మరణాల సంఖ్య 11.31 మిలియన్లకు చేరుకుంది. అంటే పుట్టే వారి కంటే చనిపోయే వారే ఎక్కువగా ఉన్నారు.
ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు జనాభా తగ్గుదలని ఆపడానికి చైనా ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది:
- ముగ్గురు పిల్లల విధానం: ఒకప్పుడు ‘ఒక్కరు ముద్దు’ అన్న చైనా, ఇప్పుడు ముగ్గురు పిల్లల వరకు అనుమతి ఇచ్చింది.
- నగదు ప్రోత్సాహకాలు: మూడు ఏళ్ల లోపు పిల్లల సంరక్షణ కోసం ప్రతి బిడ్డకు ఏడాదికి సుమారు 3,600 యువాన్లు (సుమారు 42 వేల రూపాయలు) ఇస్తోంది.
- గర్భనిరోధకాలపై పన్ను: గర్భ నిరోధక మాత్రలు, కండోమ్‌ల వంటి వాటిపై 13 శాతం పన్ను విధించి వాటి ధరలు పెంచింది. దీని ద్వారా ప్రజలు పిల్లలను కనేలా ఒత్తిడి తెస్తోంది.
- సదుపాయాలు: కిండర్ గార్టెన్ ఫీజులు మాఫీ చేయడం, ప్రసూతి సెలవులు పెంచడం వంటివి చేపట్టింది.
ఇది కూడా చదవండి: Renu Desai: ఐదు కుక్కలు కరిస్తే, అన్ని కుక్కలను చంపేస్తారా?
యువత ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?
ప్రభుత్వం ఎన్ని ఆశలు చూపినా చైనా యువత మాత్రం పిల్లలను కనడానికి ఆసక్తి చూపడం లేదు. దీనికి ప్రధానంగా ఆర్థిక కారణాలు ఉన్నాయి:
- అధిక ఖర్చులు: ప్రపంచంలోనే పిల్లల పెంపకం అత్యంత ఖరీదైన దేశాల్లో చైనా ఒకటి. ఇళ్లు, చదువుల ఖర్చులు సామాన్యులకు భారంగా మారాయి.
- పని ఒత్తిడి: ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు, వారానికి ఆరు రోజులు పని చేసే ‘996’ సంస్కృతి వల్ల యువతకు సంసార జీవితానికి సమయం దొరకడం లేదు.
- ద్వంద్వ భారం: నేటి యువ జంటలు తమ వృద్ధ తల్లిదండ్రులను చూసుకుంటూ, మరోవైపు పిల్లలను పెంచడం కష్టమని భావిస్తున్నారు. అందుకే చాలా మంది పెళ్లిళ్లకు కూడా దూరంగా ఉంటున్నారు.
భవిష్యత్తుపై ప్రభావం జనాభా తగ్గడం వల్ల చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది. పని చేసే యువత తగ్గిపోతే కార్మిక కొరత ఏర్పడుతుంది. వినియోగం తగ్గుతుంది. 2035 నాటికి చైనాలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 40 కోట్లకు చేరుతుందని అంచనా. దీనివల్ల పెన్షన్ల భారం పెరిగి దేశ ఆర్థిక పరిస్థితి దిగజారే ప్రమాదం ఉంది. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం, ఇదే పరిస్థితి కొనసాగితే ఈ శతాబ్దం చివరి నాటికి చైనా జనాభా సగానికి పడిపోయే అవకాశం ఉంది.
