Telangana: ఇలాంటి పాపిష్టి కొడుకు.. కనికరం లేని కూతురు.. అలాంటి బిడ్డలు ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే అని ప్రతిఒక్కరూ చీ కొట్టే అమానవీయ సంఘటన ఇది. తండ్రి చనిపోయి నాలుగు రోజులవుతున్నా.. తలకొరివి పెట్టడానికి కన్నకొడుకు జాడలేదు. కనీసం కూతురు సైతం కనికరించ లేదు. ఆస్తికోసం మానవత్వం మరిచిన ఆ కసాయి పిల్లలు డెడ్ బాడీని ఇంటిముందు వదిలేశారు.
సోదరి పేరిట ఉన్న రెండెకరాల భూమి తిరిగి తనకు రిజిస్ట్రేషన్ చేస్తేనే తలకొరివి పెడతానని మొండిపట్టుపట్టాడు. ఆ కూతురు మెట్టు దిగరానంటుంది. కొడుకు ఆస్తి ఇస్తే తప్ప తలకోరు పెట్టే ప్రసక్తే లేదంటున్నారు. నాలుగు రోజులనుండి ఆ తండ్రి ఆత్మ ఘోషిస్తున్నా కొడుకు, కూతురు కనికరంలేని కసాయి మనసుల్లా వ్యవరిస్తున్నారు. దీంతో ఊరంతా విషాద వాతావరణం అలముకుంది.
ఈ అమానష సంఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామంలో జరిగింది. యాదగిరి అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకి ఒక కుమారుడు. రెండో భార్యకి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. ఈ ముగ్గురి పిల్లలకు తన 15 ఎకరాల వ్యవసాయ భూమిని సమానంగా మనిషికి ఐదు ఎకరాలు చొప్పున పంచి ఎవరిది వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేయించాడు. అదే ఇప్పుడు పాపమైంది. అతని ఆత్మ ఘోసించేలా చేసింది.
కొద్దిరోజుల క్రితం రెండో భార్య కొడుకు చనిపోయాడు. దీంతో అతని పేరిట ఉన్న భూమిని తల్లి తన కూతురు పేట రిజిస్ట్రేషన్ చేసింది. అందులో మూడు ఎకరాల భూమి అమ్ముకోగా, ప్రస్తుతం రెండెకరాల భూమి మాత్రమే మిగిలింది.. అయితే రెండో భార్య కూతురుకు ఇప్పుడు రెండు ఎకరాల భూమి అదనంగా వచ్చిందని మొదటి భార్య కొడుకు రమేష్ మొండిపట్టుపట్టాడు. ఆ భూమి తనకు తనకు రిజిస్ట్రేషన్ చేస్తేనే తప్పా, తండ్రి శవానికి తలకొరివి పెట్టనని బీష్మించుకు కూర్చున్నాడు. తాను పెట్టకపోగా.. ఇంకొకరి చేత పెట్టనివ్వనని మొండిపట్టుతో అక్కడే తండ్రి శవం వద్ద కూర్చున్నాడు.
తండ్రి చనిపోయి నాలుగు రోజులు అయింది. తలకొరివి పెట్టడానికి కనికరించడం లేదని గ్రామస్తులు బంధువులు అతనితో చర్చలు జరిపారు. ఎంత బుజ్జగించినా తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి మాత్రం ముందుకు రావడం లేదు. ఎవరు పెట్టినా తాను ఒప్పుకోనని తెగేసి చెప్పాడు. తన చెల్లెలు పేరిట అదనంగా ఉన్న ఆ రెండు ఎకరాల భూమి తన పేరిట గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేస్తేనే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తానని కనికరం లేకుండా ప్రవర్తించాడు.
ఈ కసాయి కొడుకు ప్రవర్తనతో ఆ తండ్రి ఆత్మ ఘోషిస్తోంది. నాలుగు రోజుల నుండి తండ్రి డెడ్ బాడీని ఇంటిముందు వేసి ఆస్తి కోసం హైడ్రామా క్రియేట్ చేస్తున్నాడని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కూతురు కూడా తన పేరిట అదనంగా వచ్చిన రెండు ఎకరాల భూమిని వదులు కోవడానికి సిద్ధంగా లేదు.. దీంతో గ్రామం విషాద వాతావరణం చోటు చేసుకుంది.

